Smriti Mandhana: స్మృతి మంధాన విధ్వంసం.. వరల్డ్ రికార్డు బద్దలు!

Smriti Mandhana: హాంకాంగ్‌పై 124 పరుగుల విస్ఫోటక ఇన్నింగ్స్‌తో స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది.

Gagan kumar
Published on: 4 Sept 2026 8:09 AM IST
Smriti Mandhana
X

Smriti Mandhana: స్మృతి మంధాన విధ్వంసం.. వరల్డ్ రికార్డు బద్దలు!

Smriti Mandhana: ఆసియా కప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, టీ20లలో తమ రెండో అతిపెద్ద గెలుపును నమోదు చేసింది.

అయితే, ఈ చిరస్మరణీయ విజయం వెనుక భారత ఓపెనర్, పవర్ హిట్టర్ స్మృతి మంధాన ఆడిన సంచలన ఇన్నింగ్స్ నిలిచింది. మైదానంలో పరుగుల వరద పారిస్తూ కేవలం 64 బంతుల్లోనే 124 రన్స్ చేసిన మంధాన, ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ మహిళా క్రికెట్ రికార్డులన్నింటినీ తిరగరాసింది.

ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్‌గా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10,868 పరుగులు) అగ్రస్థానంలో ఉండేది. కానీ, హాంకాంగ్‌పై చేసిన 124 పరుగుల విస్ఫోటక ఇన్నింగ్స్‌తో మంధాన మొత్తం 10,880 పరుగులతో మిథాలీ రికార్డును దాటేసి ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన అగ్రగామి మహిళా క్రికెటర్‌గా నిలిచింది.

అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో టాప్-5 రన్ స్కోరర్లు వీళ్లే..

1. స్మృతి మంధాన (భారత్) – 10,880 పరుగులు

2. మిథాలీ రాజ్ (భారత్) – 10,868 పరుగులు

3. సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 10,740 పరుగులు

4. చార్లెట్ ఎడ్వర్డ్స్ (ఇంగ్లాండ్) – 10,273 పరుగులు

5. స్టెఫానీ టేలర్ (వెస్టిండీస్) – 10,007 పరుగులు

ఈ మ్యాచ్‌లో సెంచరీ బాదడం ద్వారా మంధాన తన ఖాతాలో మరో అరుదైన ఘనతను వేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 18 సెంచరీలు పూర్తి చేసుకుని, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా నిలిచింది.

ఇంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లాన్నింగ్, సౌతాఫ్రికా కెప్టెన్ లారా వొల్వార్డ్ (తలా 17 సెంచరీలు)లతో కలిసి అగ్రస్థానంలో ఉన్న మంధాన, ఇప్పుడు వారందరినీ వెనక్కి నెట్టి ఏకఛత్రాధిపత్యం సాధించింది.

కేవలం అంతర్జాతీయ రికార్డులే కాకుండా, మహిళల ఆసియా కప్ టీ20 చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (124 పరుగులు) నమోదు చేసిన బ్యాటర్‌గా స్మృతి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. క్రమశిక్షణ, టైమింగ్, పవర్ హిట్టింగ్ కలబోతగా సాగిన ఆమె ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story