ZIM vs IND 3rd T20: సికందర్ రజా చెత్త రికార్డు.. రోహిత్, బాబర్ సరసన జింబాబ్వే కెప్టెన్!

Sikandar Raza Equals Unwanted Zimbabwe Record. టీ20 కెప్టెన్లలో అత్యధిక సార్లు డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ రజా రెండో స్థానానికి చేరాడు.

Rishvik
Published on: 26 July 2026 7:40 PM IST
ZIM vs IND 3rd T20
X

ZIM vs IND 3rd T20: సికందర్ రజా చెత్త రికార్డు.. రోహిత్, బాబర్ సరసన జింబాబ్వే కెప్టెన్!

ZIM vs IND 3rd T20: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు మరోసారి అద్భుత ఆరంభం అందించారు. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే పవర్‌ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. పవర్ ప్లే పూర్తయ్యేసరికి జింబాబ్వే 53/3 స్కోర్ చేసింది. మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి బంతికే బెనెట్ ఫస్ట్ స్లిప్‌లో వైభవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. యశ్‌ ఠాకూర్ వేసిన 3.4 ఓవర్‌కు డియోన్ మైయర్స్ (19) ఔట్ అయ్యాడు. తర్వాతి బంతికి జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా డకౌట్ అయ్యాడు. రజా బంతినే గాల్లోకి లేపగా యశ్‌ ఠాకూర్ క్యాచ్ అందుకున్నాడు.

ఈ వికెట్‌తో సికందర్ రజా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి సభ్యత్వం కలిగిన దేశాల టీ20 కెప్టెన్లలో అత్యధిక సార్లు డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో రజా రెండో స్థానానికి చేరాడు. ఇప్పటివరకు కెప్టెన్‌గా ఏడు సార్లు డకౌట్ అయ్యాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎనిమిది డక్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ తలో ఆరు డక్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అంతేకాదు జింబాబ్వే తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో కూడా సికందర్ రజా అగ్రస్థానంలో నిలిచాడు. మాజీ వికెట్‌కీపర్ రెజిస్ చకాబ్వా (11)తో కలిసి రజా సంయుక్తంగా ఉన్నాడు. ఈ జాబితాలో బ్లెస్సింగ్ ముజరబాని, రిచర్డ్ నగరవ తలో తొమ్మిది డక్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మరోవైపు భారత బౌలర్లు జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. 193 పరుగుల లక్ష్య ఛేదనలో జింబాబ్వే 12 ఓవర్లకు 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ర్యాన్ బర్ల్ (31), మద్వీర (8) పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 48 బంతుల్లో 101 పరుగులు అవసరం కాగా.. అవసరమైన రన్‌రేట్ 13గా ఉంది. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే.. టీమిండియా సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.

టీ20లలో జింబాబ్వే బ్యాటర్ల డకౌట్స్:

11 - రెగిస్ చకబ్వా

11 - సికందర్ రజా

9 - ముజారబాని

9 - రిచర్డ్ నగరవ

టీ20 కెప్టెన్‌గా అత్యధిక డక్‌లు:

8 - ఆరోన్ ఫించ్

7 - సికందర్ రజా

6 - బాబర్ ఆజం

6 - రోహిత్ శర్మ

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story