IND vs SL: ఇలాంటి పిచ్ ఎక్కడా చూడలే.. ఫాలో ఆన్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాం..: గిల్!

Shubman Gill press conference: కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 290 పరుగులకే పరిమితం చేసి 213 పరుగుల ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది.

Venkat
Published on: 27 Aug 2026 6:41 PM IST
IND vs SL
X

IND vs SL: ఇలాంటి పిచ్ ఎక్కడా చూడలే.. ఫాలో ఆన్ ఇచ్చి బొక్క బోర్లా పడ్డాం..: గిల్!

Shubman Gill press conference: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో విజయం ముంగిట బోల్తా పడిన టీమిండియా చివరకు మ్యాచ్‌ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. కొలంబో వేదికగా భారీ ఆధిక్యం సాధించినా ప్రత్యర్థిని ఆలౌట్ చేయలేకపోవడంపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ అనంతరం స్పందిస్తూ పిచ్ తీరు, వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టారు.

పిచ్ నెమ్మదించడమే విజయానికి అడ్డంకి: గిల్

కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను 290 పరుగులకే పరిమితం చేసి 213 పరుగుల ఆధిక్యాన్ని భారత్ సొంతం చేసుకుంది. ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించి సులువుగా గెలవాలని భావించినా, ఐదో రోజు కొలంబో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ వంటి ఔట్ అయ్యే అవకాశాలు కూడా లేకుండా పిచ్ అత్యంత నెమ్మదించిందని శుభ్‌మన్ గిల్ వివరించారు. స్పిన్నర్లకు సైతం పిచ్ నుంచి ఎలాంటి సహకారం అందలేదని, తమ బౌలర్లు శాయశక్తులా ప్రయత్నించినా వికెట్లు తీయడం కష్టతరమైందని చెప్పారు. దాదాపు 250 ఓవర్ల పాటు మైదానంలో ఫీల్డింగ్ చేసినా లంక బ్యాటర్ల పట్టుదలకు తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందని గిల్ పేర్కొన్నారు.

పోరాడిన సోనల్ దినూష.. నిలిచిన లంక..

ఫాలోఆన్ బరిలోకి దిగిన లంక జట్టు ఒక దశలో 229/6 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో యువ బ్యాటర్ సోనల్ దినూష (133 పరుగులు) అద్భుత శతకంతో క్రీజులో పాతుకుపోయాడు. అతడికి తోడుగా నువంత 46 పరుగులు, సూరియబండార 92 పరుగులు, కమిందు మెండిస్ 55 పరుగులతో రాణించడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 429 పరుగుల భారీ స్కోరు సాధించి మ్యాచ్‌ను కాపాడుకుంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్‌కు ఎదురుదెబ్బ..

ఈ డ్రాతో భారత్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకున్నప్పటికీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో కీలకమైన ఎనిమిది పాయింట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో రాబోయే సిరీస్‌లలో భారత్ దాదాపు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వర్షం ముప్పును దృష్టిలో ఉంచుకునే ఫాలోఆన్ ఇచ్చామని, ఆ నిర్ణయం తప్పు కాదని కెప్టెన్ సమర్థించుకున్నారు. శ్రీలంక వీరోచిత పోరాటంతో ఈ డ్రా ఫలితం టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపనుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story