Shubman Gill: చురకత్తులాంటి ప్లేయర్స్ ఉన్నారు.. మేము ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాం!

Shubman Gill praised India's complete performance. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు.

Rishvik
Published on: 8 Jun 2026 6:37 PM IST
Shubman Gill
X

Shubman Gill: చురకత్తులాంటి ప్లేయర్స్ ఉన్నారు.. మేము ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాం!

Shubman Gill: అఫ్గానిస్థాన్‌తో ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 564/8 వద్ద డిక్లేర్ చేయగా.. అఫ్గాన్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలోఆన్ ఆడుతూ 112 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో భారత్ అద్భుతంగా రాణించిందని చెప్పాడు. ఈ విజయం జట్టుకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లతో కూడిన జట్టు మార్పుల దశలో ఉన్నప్పటికీ.. భవిష్యత్తు కోసం సరైన దిశలో ముందుకు సాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే అని, తాము ప్రపంచంలో ఎక్కడైనా గెలుస్తాం అని గిల్ చెప్పాడు.

ఇది జట్టు విజయం:

మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్.. 'ఇది మా నుంచి వచ్చిన పూర్తి స్థాయి ప్రదర్శన. ఇది జట్టుగా సాదించిన విక్టరీ. అన్ని విభాగాల్లో రాణించాం. ఈ విజయంతో చాలా సంతోషంగా ఉన్నాను. ఫాలోఆన్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో కూడా మేము పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్నాం. అఫ్గానిస్థాన్‌ను లంచ్‌కు ముందు లేదా మొదటి డ్రింక్స్ బ్రేక్ సమయంలో ఆలౌట్ చేస్తే.. బౌలర్లు తాజాగా ఉంటే ఫాలోఆన్ ఆడించాలని ముందే అనుకున్నాం. లేదంటే మరో రెండు సెషన్లు బ్యాటింగ్ చేసి చివర్లో మళ్లీ బౌలింగ్ చేద్దామని భావించాం. అయితే మేము త్వరగా వికెట్లు తీయగలిగాం. ఫాస్ట్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఫాలోఆన్ తర్వాత సిరాజ్ కీలక వికెట్ తీసి మాకు బ్రేక్ ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ మూడు ముఖ్యమైన వికెట్లు సాధించాడు' అని చెప్పాడు.

ఇన్ని వికెట్స్ తీయడం మాటలు కాదు:

భారత స్పిన్ త్రయం మానవ్ సుతార్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌ల ప్రదర్శనపై గిల్ ప్రశంసలు కురిపించాడు. 'మానవ్, వాషి, కుల్దీప్‌ల ప్రతిభపై ఎప్పుడూ ఎలాంటి సందేహం లేదు. వాళ్లందరిలో నాణ్యత ఉంది. వారికి కావాల్సింది అనుభవం మాత్రమే. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తూ.. వివిధ పరిస్థితుల్లో బ్యాటర్లను ఎలా సెటప్ చేయాలి, వేగాన్ని ఎలా మార్చాలి, ఎలాంటి ప్రాంతాల్లో పరీక్షించాలి అనే విషయాలు అనుభవంతో వస్తాయి. ఈ మ్యాచ్‌లో వాళ్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా మానవ్ అద్భుతంగా బంతులు వేశాడు. డెబ్యూ టెస్టులో ఇన్ని వికెట్స్ తీయడం మాటలు కాదు. భారత్ విజయంలో అతడి పాత్ర చాలా కీలకం' అని గిల్ పేర్కొన్నాడు.

మా లక్ష్యం చాలా సింపుల్:

భారత క్రికెట్ భవిష్యత్తుపై కూడా గిల్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 'మా లక్ష్యం చాలా సింపుల్. ప్రపంచంలో ఎక్కడ ఆడినా, ఎలాంటి పరిస్థితుల్లో ఆడినా తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 350 పరుగులు చేయాలి. మా బౌలింగ్ విభాగంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. 350 పరుగులు బోర్డుపై ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా 20 వికెట్లు తీయగల సామర్థ్యం మా బౌలర్లకు ఉంది. జట్టులో మార్పులు వచ్చినప్పుడు సాధారణంగా బ్యాటింగ్ యూనిట్‌పైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ప్రస్తుతం మేము అనుభవాన్ని సంపాదించుకుంటూ.. వివిధ పరిస్థితుల్లో ఎలా ఆడాలో నేర్చుకుంటున్నాం. భవిష్యత్తులో క్రమం తప్పకుండా 350-400 పరుగుల స్కోర్లు నమోదు చేసే బ్యాటింగ్ యూనిట్‌గా ఎదగడమే మా లక్ష్యం' అని స్పష్టం చేశాడు.

భారత జట్టు భవిష్యత్తుపై ఆశలు:

అఫ్గానిస్థాన్‌పై చారిత్రాత్మక విజయంతో భారత్ టెస్ట్ క్రికెట్‌లో తన అతిపెద్ద ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో కొత్త తరం ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేయడం భారత జట్టు భవిష్యత్తుపై ఆశలు పెంచుతోంది. ముఖ్యంగా మానవ్ సుతార్ వంటి యువ స్పిన్నర్ల రాకతో భారత బౌలింగ్ విభాగానికి కొత్త బలం లభించినట్లు కనిపిస్తోంది. ఇంగ్లండ్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా గడ్డలపై కూడా ఇలానే ఆడితే.. మరో దశాబ్దం మనదే అవుతుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story