Shubham Juyal : విధిపై గెలిచిన వీరుడు.. కామన్వెల్త్ మెడల్ కొట్టిన 'ఆర్మీ' కలల శుభం.!

Shubham Juyal : సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. 2022 ఆగస్టు 1న శుభం జుయల్ అనే ఒక 26 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోని ఐసీయూ (ICU) బెడ్‌పై చావుబతుకుల మధ్య

G Krishna
Published on: 2 Aug 2026 1:06 PM IST
shubham juyal
X

shubham juyal

Shubham Juyal : సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. 2022 ఆగస్టు 1న శుభం జుయల్ అనే ఒక 26 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోని ఐసీయూ (ICU) బెడ్‌పై చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో తొడ పైవరకు కాలు తొలగించాల్సి రావడంతో, కొద్ది రోజుల్లో జరగాల్సిన ఇండియన్ ఆర్మీ ఇంటర్వ్యూ, దేశానికి సేవ చేయాలనే కన్నుల నిండా ఉన్న కలలు కళ్లముందే కరిగిపోయాయి. ఇక జీవితంలో ఏమీ సాధించలేనేమో అనే నిరాశ, నిస్పృహలు అతడిని చుట్టుముట్టాయి. కట్ చేస్తే.. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే రోజున (ఆగస్టు 1, 2026) శుభం జుయల్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం (Silver Medal) సాధించి, మెడలో మెరుస్తున్న పతకంతో వేదికపై గర్వంగా నిలబడ్డాడు. కష్టాలు వచ్చాయని లొంగిపోకుండా, ఆత్మవిశ్వాసంతో పోరాడి విజేతగా నిలిచాడు!

ఐసీయూ బెడ్ నుంచి కామన్వెల్త్ పోడియం వరకు

తన అసాధారణ ప్రయాణం గురించి శుభం జుయల్ మాట్లాడుతూ.. "ఇది నాకు చాలా పెద్ద విజయం. నాలుగేళ్ల క్రితం ఇదే ఆగస్టు 1న నేను ఐసీయూలో ఉన్నాను. కాలు తీసేయడంతో నా జీవితంపై ఆశలన్నీ వదులుకున్నాను. నాలుగేళ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో పోటీపడతానని, రజత పతకం గెలుచుకుంటానని కలనాటి కూడా ఊహించలేదు" అని భావోద్వేగానికి గురయ్యాడు. ప్రమాదానికి ముందు శుభం ఏకైక లక్ష్యం ఇండియన్ ఆర్మీలో అధికారి కావడం. ఆర్మీ కేడెట్ కాలేజీ (ACC) రాసిన రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడై, సరిగ్గా వారం రోజుల్లో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (SSB) ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉండగా దారుణమైన మోటార్ సైకిల్ ప్రమాదానికి గురయ్యాడు. ఆ ఘటన అతడి జీవిత గమ్యాన్నే మార్చేసింది.

మలుపు తిప్పిన ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్

ప్రమాదం తర్వాత జీవితం శూన్యంగా అనిపిస్తున్న సమయంలో.. 2023లో శుభం ఆర్మీ పారా ఒలింపిక్ నోడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కడ అతనికి సుబేదార్ మేజర్ ఆర్.కె. సింగ్ రావత్ పరిచయమయ్యారు. అతడే శుభం జీవితాన్ని మళ్లీ నిలబెట్టిన మార్గదర్శి. "నాకు షాట్‌పుట్ క్రీడ గురించి అక్షరం ముక్క కూడా తెలియదు. అసలు ఓనమాలు కూడా రావు. కానీ నా కోచ్ నన్ను ఎంతగానో ప్రోత్సహించి ప్రతి విషయాన్ని నేర్పించారు. ఈ ప్రయాణంలో ఇండియన్ ఆర్మీ, నా కుటుంబం, నా స్నేహితులు నన్ను కొండంతగా నిలబెట్టారు" అని శుభం తన కృతజ్ఞతలు తెలిపాడు.

తదుపరి లక్ష్యం.. 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్ స్వర్ణం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో గెలిచిన ఈ వెండి పతకం తనకు ఒక ఆరంభం మాత్రమేనని శుభం స్పష్టం చేశాడు. ఇంకా సాధించాల్సింది చాలా ఉందంటున్న ఈ యోధుడు, తన తదుపరి దృష్టిని 2028 లాస్ ఏంజెల్స్ పారాలింపిక్స్ (LA Paralympics) పై ఉంచాడు. 2028 పారాలింపిక్స్‌లో పసిడి పతకం సాధించి భారత పతాకాన్ని ఎగురవేయడమే తన తదుపరి ఏకైక లక్ష్యమని ధీమా వ్యక్తం చేశాడు. వైకల్యం శరీరానికే కానీ మనస్సుకు కాదని నిరూపించిన శుభం జుయల్ ప్రయాణం ఎందరో యువతకు నిజమైన స్పూర్తిదాయకం..

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story