ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చిన శ్రేయస్ అయ్యర్.. 'Second DOB'పై సోషల్ మీడియాలో రచ్చ!

Shreyas Iyer: Shreyas Iyer Instagram Bio Goes Viral. ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చడం చర్చనీయాంశమైంది.

Rishvik
Published on: 25 Jun 2026 6:55 PM IST
Shreyas Iyer
X

ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చిన శ్రేయస్ అయ్యర్.. 'Second DOB'పై సోషల్ మీడియాలో రచ్చ!

Shreyas Iyer: భారత్, ఐర్లాండ్‌ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్దమైంది. శుక్రవారం (జూన్ 26) సాయంత్రం స్టోర్మాంట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్‌ జరగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌కు సిద్ధమవుతున్న శ్రేయస్ అయ్యర్ సోషల్ మీడియాలో చేసిన ఓ మార్పు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌కు ముందు అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చడం చర్చనీయాంశమైంది. టీ20 కెప్టెన్‌గా అరంగేట్రం చేయబోతున్న ఈ స్టార్ బ్యాటర్.. తన బయోలో 'Second DOB: 25.12.2025' అని ఉంచాడు. దాంతో అభిమానులు ఆ తేదీ వెనుక అసలు అర్థం ఏమిటో తెలుసుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.

అభిమానుల్లో చర్చకు దారితీసిన బయో మార్పు:

గత నెలలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేశాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభమయ్యే సిరీస్‌లో తొలిసారి భారత జట్టును నడిపించనున్నాడు. ఈ కీలక సందర్భానికి ముందు అతను ఇన్‌స్టాగ్రామ్ బయోలో చేసిన మార్పు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే 'Second DOB' అంటే ఏమిటి?, ఆ తేదీ ఎందుకు పెట్టాడనే విషయంపై అధికారికంగా ఎలాంటి వివరణ లేదు. కానీ ఓ అభిమాని చేసిన పోస్ట్ ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.

గాయం నుంచి తిరిగొచ్చిన రోజేనా?:

2025 డిసెంబర్ 25 శ్రేయస్ అయ్యర్ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ప్రాణాంతకమైన గాయం నుంచి కోలుకున్న అనంతరం ఆ రోజే మళ్లీ బ్యాట్ చేతిలోకి తీసుకుని ప్రాక్టీస్ ప్రారంభించాడట. క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టిన ఆ క్షణాన్ని అయ్యర్ తన 'రెండో జన్మదినం'గా భావించి ఉండొచ్చని ఓ అభిమాని ట్వీట్ చేశాడు. 'అది కేవలం క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన రోజు మాత్రమే కాదు. అతని జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు. అందుకే ఆ తేదీని బయోలో పెట్టి ఉండొచ్చు' అని ఆ అభిమాని పోస్టు చేశాడు.

కొత్త బాధ్యతలతో కొత్త అధ్యాయం:

శ్రేయస్ అయ్యర్‌కు ఈ ఐర్లాండ్ సిరీస్ చాలా కీలకం. దాదాపు రెండేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి తిరిగి వచ్చిన అతడు ఇప్పుడు కెప్టెన్ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా సాధించిన విజయాల అనుభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా కొనసాగించాలని భావిస్తున్నాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుతో భారత జట్టును దూకుడుగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఉన్న అయ్యర్‌కు ఈ సిరీస్ నాయకత్వ పరంగా తొలి పరీక్షగా నిలవనుంది.




Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story