Shreyas Iyer: అతడే మాకొంపముంచాడు.. గెలిచే మ్యాచ్ ఓడిపోయాం.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన!

Shreyas Iyer: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెండో టీ20లో టీమిండియా ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు.

Rishvik
Published on: 5 July 2026 9:35 AM IST
Shreyas Iyer
X

Shreyas Iyer: అతడే మాకొంపముంచాడు.. గెలిచే మ్యాచ్ ఓడిపోయాం.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన!

Shreyas Iyer: భారత్, ఇంగ్లండ్ మధ్య మాంచెస్టర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 19 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యం సాధించింది.

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో ఎక్కడ తేడా జరిగిందో అందరికీ తెలుసని చెప్పిన శ్రేయస్.. ఓ ఆటగాడిని మాత్రమే నిందించడం సరైంది కాదని స్పష్టం చేశాడు. ముఖ్యంగా 17వ ఓవర్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో మ్యాచ్ పూర్తిగా ఇంగ్లండ్ వైపు మళ్లిందని.. అయితే అతడిపై విమర్శలు చేయడం సరికాదని శ్రేయస్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ అనంతరం నాసర్ హుస్సేన్‌తో శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. '15వ ఓవర్ వరకు మ్యాచ్ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది. అద్భుతంగా ఆడుతున్నాం. కానీ ఒక్కసారిగా మ్యాచ్ మొమెంటం ఇంగ్లండ్ వైపు వెళ్లిపోయింది. ఆ తర్వాత వాళ్లకు విజయం సాధించడం చాలా సులభంగా మారింది. ఏ ఒక్క ఆటగాడినీ తప్పుబట్టాలని నేను అనుకోవడం లేదు" అని చెప్పాడు. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్ గురించి ప్రశ్నించగా.. 'మొదటి నోబాల్ తర్వాత బిష్ణోయ్ బలంగా తిరిగి వస్తాడని అనుకున్నా. కానీ వరుసగా జరిగిన తప్పిదాలు మమ్మల్ని వెనకబడేలా చేశాయి. అయితే అతడు ఈ అనుభవం నుంచి చాలా నేర్చుకుంటాడని నమ్ముతున్నాను' అని కెప్టెన్ పేర్కొన్నాడు.

భారత్ చేసిన 190 పరుగుల స్కోరుపై స్పందిస్తూ.. 'ఈ పిచ్‌పై 190 పరుగులు చాలా మంచి స్కోరే. బౌలర్లకు మంచి బౌన్స్ లభించింది. చివరి ఓవర్‌లో తిలక్ వర్మ చేసిన కీలక పరుగులు మాకు మంచి ఆధిక్యం ఇచ్చాయి. ఛేదనలో తొలి 15 ఓవర్లు పూర్తిగా మేమే ఆధిపత్యం చెలాయించాం. కానీ ఆ తర్వాత జేకబ్ బెతెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. అతడు ఎంతో ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించుకున్నాడు. లూజ్ బాల్స్‌ను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. అతడి షాట్స్ బాగున్నాయి. బెతెల్ ధాటిగా ఆడడంతో మేము వెనకపడిపోయాం.అతడిని పరుగులు చేయకుండా ఆపుంటేఫలితం మరోలా ఉండేది' అని శ్రేయస్ ప్రశంసించాడు.

మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు పరుగుల వేగం తగ్గడంపై శ్రేయస్ స్పందించాడు. 'సామ్ కరన్ ఈ మైదానం కొలతలను, పిచ్ స్వభావాన్ని చాలా త్వరగా అర్థం చేసుకున్నాడు. ముఖ్యంగా మా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, ఆఫ్‌స్టంప్ వెలుపల కచ్చితమైన లైన్‌లో బౌలింగ్ చేశాడు. మా బలాన్ని దృష్టిలో పెట్టుకుని వారు అద్భుతమైన ప్రణాళికతో బౌలింగ్ చేశారు" అని తెలిపాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై కూడా భారత కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు.

'వైభవ్ నిర్భయమైన ఆటగాడు. అతడిలో భయం అనే మాటే లేదు. నెట్స్‌లో బ్యాటింగ్ చేసే తీరు చూస్తేనే అతడి ఆత్మవిశ్వాసం అర్థమవుతుంది. అతడు ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోలేదు. గత కొన్ని నెలలుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడు. అతడిలో ఉన్న ప్రతిభపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ వేదికపై అతడు చూపించిన ధైర్యం చూడటం చాలా ఆనందంగా ఉంది' అని కొనియాడాడు.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటములపై స్పందిస్తూ శ్రేయస్ అయ్యర్ ఆశావహంగా మాట్లాడాడు. 'మా ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. ఇదే అత్యంత కష్టమైన దశ అని నాకు తెలుసు. ఇక ఇక్కడి నుంచి ముందుకు వెళ్లే మార్గం ఒక్కటే.. మ్యాచ్ గెలవడం. మేము బలంగా తిరిగి వస్తాం. మూడో టీ20లో కచ్చితంగా గెలుస్తాం' అని శ్రేయస్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచులో శ్రేయాస్ 22 బంతుల్లో 37 రన్స్ బాదాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story