Shreyas Iyer: శుభ్‌మన్ గిల్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌.. కారణం ఏంటంటే?

Shreyas Iyer took over captaincy duties: భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Rishvik
Published on: 17 Jun 2026 6:48 PM IST
Shreyas Iyer
X

Shreyas Iyer: శుభ్‌మన్ గిల్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌.. కారణం ఏంటంటే?

Shreyas Iyer: లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. భారత్ రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా మైదానంలోకి దిగలేదు.

దాంతో వైస్ కెప్టెన్ శ్రేయస్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. సెంచరీ అనంతరం గిల్ పదేపదే వెన్ను నొప్పితో బాధపడ్డాడు. 2-3 సార్లు ఫిజియోలు వచ్చి చికిత్స చేసిన అనంతరం గిల్ బ్యాటింగ్ కొనసాగించాడు. ప్రస్తుతం గిల్ భారత డ్రెసింగ్ రూంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.

గిల్, ఇషాన్ శతకాలు:

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ 110 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడుతూ.. 79 బంతుల్లో 125 పరుగులు చేసి శతకం నమోదు చేశాడు. గిల్, ఇషాన్ కిషన్ కలిసి రెండో వికెట్‌కు 224 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరు అఫ్గాన్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ.. పరుగుల వరద పారించారు.

రోహిత్ శర్మ ఫిఫ్టీ మిస్:

లక్నోలోని ఏకానా క్రికెట్ స్టేడియంలో టాస్ ఓడి భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అయితే స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ వేసిన అద్భుత గూగ్లీకి బోల్తాపడ్డాడు. గిల్, ఇషాన్ అనంతరం భారత బ్యాటర్లు వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయారు. శ్రేయస్ అయ్యర్ 26, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేసి జట్టు స్కోరును నాలుగొందల దాటించారు. అఫ్గానిస్థాన్ బౌలర్లు చివర్లో వికెట్లు సాధించారు. నంగేయాలియా ఖరోటే 4 వికెట్లు తీసి తీశాడు. రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా.. అల్లాహ్ ఘజన్‌ఫర్, మహమ్మద్ సలీం తలో వికెట్ దక్కించుకున్నారు.

8 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 52/1:

భారత్ నిర్దేశించిన 403 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు అఫ్గానిస్థాన్ జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (26), ఇబ్రహీం జద్రాన్ (6) నిలకడగా ఆడ్డంతో 5 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 32/0గా నిలిచింది. దూకుడుగా ఆడుతున్న గుర్బాజ్ (41) పెవిలియన్ చేరాడు. గూర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో (7.3 ఓవర్‌) కీపర్ లోకేష్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 8 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 52/1. భారత జట్టు బ్యాటింగ్‌లో ఆధిపత్యం చెలాయించగా.. ఇప్పుడు బౌలర్లు కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story