Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!

Shikhar Dhawan facing criticism on social media Over NEET Protest Post. మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కేంద్ర ప్రభుత్వంకు మద్దతుగా, విద్యార్థులకు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు.

Rishvik
Published on: 23 July 2026 6:28 PM IST
Shikhar Dhawan
X

Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై పోస్ట్.. శిఖర్ ధావన్‌ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!

Shikhar Dhawan: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తోంది. భారీ ఎత్తున యువత ఈ ఉద్యమంలో పాల్గొంటోంది. ఈ ఉద్యమానికి దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రెటీల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కేంద్ర ప్రభుత్వంకు మద్దతుగా, విద్యార్థులకు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడు. దాంతో సోషల్ మీడియాలో గబ్బర్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. లక్షలాది పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉన్నప్పుడు మీరెలా కేంద్ర ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తారు అని నెటిజెన్స్ మండిపడుతున్నారు.

కలలు, ఆశయాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో.. అదే సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో యువత సహనం వహించడం కూడా అంతేముఖ్యం అని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. 'మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. వారి కలలు, ఆశయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహనం కోల్పోకుండా దేశంలోని సంస్థలు, ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలి. ప్రతి సవాలుకు పరిష్కారం సహనంతోనే లభిస్తుంది. భారత్ ఎప్పుడూ ముందుకు సాగింది.. భవిష్యత్తులోనూ అదే దిశగా పయనిస్తుంది' అని ధావన్ తన పోస్టులో రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై స్టూడెంట్స్, నెటిజెన్స్మండిపడుతున్నారు.

నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తొలిసారిగా స్పందించారు. యువత భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొన్నారు. ప్రశ్నాపత్రాల లీక్‌లకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకునేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, సంబంధిత అధికారులకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు పీఎం వెల్లడించారు.

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ అంశంపై స్పందించాడు. ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే అవకాశం పొందాలని, భద్రతతో తమ కలలను సాకారం చేసుకునే హక్కు అందరికీ ఉండాలని పేర్కొన్నాడు. దేశ భవిష్యత్తు కోసం సంభాషణ ద్వారానే సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చాడు. శిఖర్ ధావన్, యువరాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి

మరోవైపు నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. టోల్స్టాయ్ మార్గ్, జనపథ్ ప్రాంతాల్లో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రహదారులపై నిరసన చేపట్టడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. కొందరు నిరసనకారులు రోడ్డుపై పడుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జి చేయగా.. భద్రతా సిబ్బందిపై కొందరు స్టూడెంట్స్ రాళ్లు, చెప్పులు రువ్వారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story