39వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు పునాదులు వేసిన పేసర్ కన్నుమూత!
Former Afghanistan pacer Shapoor Zadran passed away. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు పునాదులు వేసిన ప్రముఖ మాజీ ఫాస్ట్ బౌలర్ షపూర్ జద్రాన్ కన్నుమూశారు
39వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు.. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు పునాదులు వేసిన పేసర్ కన్నుమూత!
ఆఫ్గనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌కు పునాదులు వేసిన ప్రముఖ మాజీ ఫాస్ట్ బౌలర్ షపూర్ జద్రాన్ కన్నుమూశారు. అరుదైన వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన.. తన 39వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు తుదిశ్వాస విడిచారు. హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ అనే అరుదైన రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధితో షపూర్ జద్రాన్ బాధపడుతున్నారు. ఈ వ్యాధి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మెరుగైన చికిత్స కోసం ఈ ఏడాది జనవరిలో ఆయనను న్యూఢిల్లీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన కన్నుమూశారు.
44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు:
షపూర్ జద్రాన్ మరణ వార్తను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఆయన మృతితో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్‌తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షపూర్ 2009 నుంచి 2020 వరకు ఆఫ్ఘనిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 44 వన్డేలు, 36 టీ20 మ్యాచ్‌లు ఆడి 43 వన్డే వికెట్లు, 37 టీ20 వికెట్లు పడగొట్టారు. 2009లో నెదర్లాండ్స్‌పై వన్డే అరంగేట్ర మ్యాచ్‌లోనే 4/24 గణాంకాలతో సత్తా చాటారు.
2015 వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన:
2015 వన్డే ప్రపంచకప్‌లో షపూర్ జద్రాన్ అద్భుత ప్రదర్శన చేశారు. మెగా టోర్నీలో 10 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచారు. దేశీయ క్రికెట్‌లో కూడా రాణించారు. 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 17 వికెట్లు, 56 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు, 83 టీ20 మ్యాచ్‌ల్లో 90 వికెట్లు తీశారు. షపూర్ చికిత్స పొందుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ, స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సహా పలువురు ఆటగాళ్లు ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినప్పటికీ.. చివరకు మరణం అందరినీ విషాదంలో ముంచెత్తింది.
కోపంతో బౌలింగ్ చేస్తేనే:
షపూర్ జద్రాన్ మృతిపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. 'ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఎదుగుదలకు పునాదులు వేసిన వారిలో షపూర్ జద్రాన్ ఒకరు. ఆయన అంకితభావం, పోరాట పటిమ, దేశం కోసం ఆడిన తీరును ఎప్పటికీ మరువలేం. మైదానంలోనే కాదు, యువ క్రికెటర్లకు కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఆయన సేవలు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి' అని ఏసీబీ పేర్కొంది. ఆరు అడుగుల రెండు అంగుళాల ఎత్తుతో, ఫాస్ట్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టే వారు. 'కోపంతో బౌలింగ్ చేస్తేనే బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయించగలను' అని ఒక సందర్భంలో చెప్పిన మాటలు అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయాయి. ఆయన మరణంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ఒక గొప్ప యోధుడిని కోల్పోయింది.




