Sarfaraz Khan: 17 కిలోల వెయిట్ లాస్.. కశ్మీర్‌లో కఠిన శిక్షణ.. టీమిండియాలోకి రావడానికి ఎంతో కష్టపడ్డా సర్ఫరాజ్!

Sarfaraz Khan: టీమిండియా టెస్టు జట్టులోకి మళ్లీ రావాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది.

Rishvik
Published on: 10 Aug 2026 6:10 PM IST
Sarfaraz Khan
X

Sarfaraz Khan: 17 కిలోల వెయిట్ లాస్.. కశ్మీర్‌లో కఠిన శిక్షణ.. టీమిండియాలోకి రావడానికి ఎంతో కష్టపడ్డా సర్ఫరాజ్!

Sarfaraz Khan: టీమిండియా టెస్టు జట్టులోకి మళ్లీ రావాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్‌కు ఎట్టకేలకు అవకాశం దక్కింది. శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో సర్ఫరాజ్‌కు చోటు లభించింది. బ్యాటర్ సాయి సుదర్శన్ గాయం కారణంగా ఏర్పడిన ఖాళీ అతడికి కలిసొచ్చింది. పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తేనే సుదర్శన్‌ను లంకతో సిరీస్‌లో ఆడిస్తామని బీసీసీఐ ముందే చెప్పింది. సమయానికి అతడు కోలుకోకపోవడంతో జట్టు నుంచి తప్పించి.. సర్ఫరాజ్‌కు అవకాశమిచ్చారు. అయితే ఈ అవకాశాన్ని అందుకోవడం వెనుక సర్ఫరాజ్ చేసిన కష్టం అంతా ఇంతా కాదు.

17 కిలోల బరువు తగ్గిన సర్ఫరాజ్:

భారత జట్టులోకే రావడానికి తన శక్తిమేరకు పోరాడతానంటూ సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ మాటలకు తగ్గట్టుగానే అతడు గత ఏడాదిన్నర కాలంలో ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. గతంలో ఫిట్‌నెస్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న సర్ఫరాజ్.. ఇప్పుడు మరింత ఫిట్‌గా, పదునైన లుక్‌తో కనిపిస్తున్నాడు. బరువు తగ్గడంతో అతడి టీ20 ఆటలో కూడా మరింత దూకుడు కనబడుతోంది. దేశవాళీ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు సర్ఫరాజ్ శారీరకంగా సరిపోతాడా అనే సందేహాలు గతంలో వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించినప్పటికీ.. అతడికి జాతీయ జట్టులో అవకాశం రాలేదు. ఇప్పుడు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి తనను తాను మరింత మెరుగుపరుచుకోవడం ద్వారా ఆ విమర్శలకు సమాధానం ఇచ్చాడు.

ముంబైలో వర్షాలు.. కశ్మీర్‌లో కఠిన శిక్షణ:

2026 ఐపీఎల్ తర్వాత సర్ఫరాజ్ ముంబై టీ20 లీగ్‌లో ఆకాశ్ టైగర్స్ వెస్ట్రన్ ముంబై సబర్బ్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ముంబైలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ప్రాక్టీస్ చేయడం కష్టంగా మారింది. దీంతో అతడు కశ్మీర్‌కు వెళ్లి అక్కడ కొన్ని రోజులు కఠిన శిక్షణ తీసుకున్నాడు. షేర్-ఎ-కశ్మీర్ స్టేడియంలో నెట్ బౌలర్లతో పాటు రాష్ట్ర జట్టు ఆటగాళ్లతో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అంతేకాకుండా ముంబైలోని బీకేసీ ఎంసీఏ ఇండోర్లో ఆస్ట్రో టర్ఫ్‌పై కూడా స్కిల్స్ ట్రైనింగ్ చేశాడు. కుర్లా పరిసరాల్లోని ప్రైవేట్ ప్రాక్టీస్ సదుపాయాలను అద్దెకు తీసుకుని.. ప్రత్యేకంగా సిద్ధం చేయని ఎర్రమట్టి పిచ్‌లపై గంటల తరబడి బ్యాటింగ్ చేశాడు.

స్పిన్‌ను ఎదుర్కోవడంలో సర్ఫరాజ్ బలం:

శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సర్ఫరాజ్ ఎంపిక టీమిండియాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ తర్వాత స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనే బ్యాటర్లలో సర్ఫరాజ్ కూడా ఒకడు. సర్ఫరాజ్‌కు సంప్రదాయ స్వీప్‌తో పాటు రివర్స్ స్వీప్ ఆడే సామర్థ్యం కూడా ఉంది. బంతిని స్క్వేర్ ముందు, వెనుక వైపునకు కూడా స్వీప్ చేయగలగడం అతడి ప్రత్యేకత. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య వంటి బౌలర్లను ఎదుర్కొనే సమయంలో ఈ షాట్లు సర్ఫరాజ్‌కు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.

2024లో జట్టు నుంచి అవుట్:

2024లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో విఫలమైన తర్వాత సర్ఫరాజ్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ సిరీస్‌లో భారత బ్యాటింగ్ యూనిట్ మొత్తం విఫలమైనప్పటికీ.. సర్ఫరాజ్‌పైనే వేటు పడటం అతడికి తీవ్ర నిరాశ కలిగించింది. అయినప్పటికీ అతడు తన ప్రయత్నాలను ఆపలేదు. ఇంగ్లండ్ పర్యటనలో ఇండియా-ఏ తరఫున ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో 92 పరుగులు చేశాడు. అనంతరం బెకెన్‌హామ్‌లో ఇండియా, ఇండియా-ఏ మధ్య జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. అయినప్పటికీ టీమిండియాలోకి తిరిగి రావడానికి మాత్రం కొంతకాలం వేచి చూడాల్సి వచ్చింది.

సర్ఫరాజ్‌కే అవకాశం?:

శ్రీలంక పర్యటనలో సర్ఫరాజ్ ఎంపికకు మరో కారణం స్పిన్‌ను ఎదుర్కొనే అతడి సామర్థ్యమే. ధ్రువ్ జురెల్ ఇటీవల ఇండియా-ఏ జట్టు కెప్టెన్‌గా శ్రీలంకకు వెళ్లి రెండు ‘ఏ’ టెస్టుల్లో భారీ సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. అయితే తాజాగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆఫ్‌స్పిన్నర్ బౌలింగ్‌లో తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో సైమన్ హార్మర్ కూడా జురెల్‌ను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు ఔట్ చేశాడు. దీంతో శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పరిస్థితుల్లో జురెల్‌ను బ్యాటర్‌గా ఆడిస్తారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విషయంలో సర్ఫరాజ్‌కు మెరుగైన షాట్ రేంజ్ ఉండటం అతడికి కలిసొచ్చే అంశంగా మారింది.

అసలు పరీక్ష శ్రీలంకలోనే:

సెలెక్టర్ల నమ్మకాన్ని తిరిగి గెలుచుకున్న సర్ఫరాజ్.. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు స్పిన్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న అతడు.. శ్రీలంకలో ప్రభాత్ జయసూర్య తదితర స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. రెండేళ్లుగా ఎదురుచూసిన అవకాశం ఇప్పుడు సర్ఫరాజ్ తలుపు తట్టింది. 17 కిలోల బరువు తగ్గడం నుంచి కశ్మీర్‌లో కఠిన శిక్షణ వరకు చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు మైదానంలో ఫలితం చూపించాల్సిన సమయం వచ్చింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story