Sanju Samson : ఇది బ్యాటింగ్ కాదు.. బౌలర్లపై సంజూ చేసిన సర్జికల్ స్ట్రైక్.. రికార్డులన్నీ బ్రేక్

Sanju Samson : ఐపీఎల్ 2026 లో సంజూ శాంసన్ అద్భుత సెంచరీతో చెన్నై 207 పరుగులు చేసింది. ముంబైపై పరుగుల వర్షం కురిపించిన సంజూ, కెరీర్‌లో 5వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

CR Reddy
Published on: 24 April 2026 7:13 AM IST
Sanju Samson
X

Sanju Samson

Sanju Samson : ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూ శాంసన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సంజూ అజేయ సెంచరీతో చెలరేగిపోయాడు. కేవలం 54 బంతుల్లోనే 101 పరుగులు చేసిన సంజూ, ఈ సీజన్‌లో తన రెండో సెంచరీని నమోదు చేశాడు. ఆయన విధ్వంసకర ఇన్నింగ్స్ ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 20 ఓవర్లలో 207 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ సంజూ చేసిన ఈ బ్యాటింగ్ విన్యాసం క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించింది.

సంజూ శాంసన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఐదో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనతతో ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ సరసన నిలిచాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (8), జోస్ బట్లర్ (7), క్రిస్ గేల్ (6) మాత్రమే సంజూ కంటే ముందున్నారు. తన 179వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకున్న సంజూ, మరో 3 పరుగులు చేసి ఉంటే ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల క్లబ్ లో కూడా చేరి ఉండేవాడు.

ఒక దశలో సంజూ సెంచరీ కష్టమనిపించింది. ఎందుకంటే 17వ ఓవర్ నుంచి 18వ ఓవర్ ముగిసే వరకు సంజూకి స్ట్రైకింగ్ కేవలం ఒకే ఒక్కసారి దక్కింది. అయితే ఆఖరి రెండు ఓవర్లలో పట్టుదలతో బ్యాటింగ్ చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి సెంచరీని పూర్తి చేశాడు. తన 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. సంజూ బ్యాటింగ్ స్టైల్ చూసి వాంఖడే స్టేడియంలో ఉన్న ముంబై అభిమానులు సైతం ఫిదా అయిపోయారు.

చెన్నై సూపర్ కింగ్స్ సాధించిన 207 పరుగులలో ఏకంగా 148 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. జట్టు మొత్తం కలిసి 12 సిక్సర్లు, 19 ఫోర్లు బాదారంటే బ్యాటర్ల జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆఖరి మూడు ఓవర్లలో చెన్నై బ్యాటర్లు ఏకంగా 43 పరుగులు రాబట్టారు. ముంబై ఇండియన్స్‌పై సీఎస్కే కి ఇది మూడో అత్యధిక స్కోరు కావడం విశేషం.

ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగతా వారందరినీ సంజూ ఒక ఆట ఆడుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా వేసిన రెండు ఓవర్లలోనే భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. మిచెల్ శాంట్నర్, అల్లా గజన్ఫర్ వికెట్లు తీసినప్పటికీ పరుగుల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. సంజూ క్లాస్ షాట్లు, పవర్ హిట్టింగ్ ముందు ముంబై బౌలింగ్ ప్లాన్లన్నీ తలకిందులయ్యాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story