Sanju Samson: 14 ఏళ్లకే ఐపీఎల్ ట్రయల్స్ ఆడా.. దిగ్గజ క్రికెటర్లనే ఫిదా చేశా!
Sanju Samson: Sanju Samson Recalls KKR Selection Trials. సంజు శాంసన్ తన క్రికెట్ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.
Sanju Samson: 14 ఏళ్లకే ఐపీఎల్ ట్రయల్స్ ఆడా.. దిగ్గజ క్రికెటర్లనే ఫిదా చేశా!
Sanju Samson: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ తన క్రికెట్ ప్రయాణంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తాను కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టాప్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొన్నానని గుర్తు చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలు, అప్పటి కేకేఆర్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండ్ హెడ్ కోచ్ జాన్ బుకానన్ సమక్షంలో ట్రయల్స్ ఇవ్వడం తన జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి అని కేరళ ఆటగాడు సంజు తెలిపాడు. దిగ్గజ క్రికెటర్లనే ఫిదా చేశా అని చెప్పుతూ సంతోషపడ్డాడు.
ప్రస్తుతం సంజు శాంసన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ ఆడిన అతడు.. 2, 3 టీ20ల్లో ఆడలేదు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సంజుకు తుది జట్టులో అవకాశం దక్కలేదు. తాజాగా జియోస్టార్ నిర్వహించిన 'సూపర్‌స్టార్స్' కార్యక్రమంలో పాల్గొన్న సంజు తన చిన్ననాటి జ్ఞాపకాలను వివరించాడు. కేరళ అండర్-13 టోర్నమెంట్‌లో మంచి ప్రదర్శన చేసిన అనంతరం తన చిన్ననాటి కోచ్ బిజూ జార్జ్ కేకేఆర్ ట్రయల్స్‌కు తీసుకెళ్లారని చెప్పాడు.
'అప్పుడు నా వయసు 14 ఏళ్లు. ఆయా సమయలో కేకేఆర్ కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ, హెడ్ కోచ్‌గా జాన్ బుకానన్ ఉన్నారు. వారి ముందే ట్రయల్స్ ఇచ్చాను. అది నాకు నమ్మశక్యం కాని అనుభూతి అనే చెప్పాలి. ట్రయల్స్‌లో నా ఆటను చూసి కేకేఆర్ 'బి' జట్టులో చోటు కల్పించారు. ఆపై శ్రీలంక పర్యటనకు వెళ్లే అవకాశం కూడా దక్కింది. నా కెరీర్ ప్రారంభ దశలో బిజూ సార్ నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. నా కెరీర్ ఇలా ఉండడానికి ప్రధాన కారణం బిజూ సార్' అని శాంసన్ తెలిపాడు.
తన క్రికెట్ కోసం కుటుంబం చేసిన త్యాగాలను కూడా సంజు శాంసన్ గుర్తు చేసుకున్నాడు. 'విద్యా సంవత్సరం మధ్యలో ఢిల్లీ నుంచి తిరువనంతపురానికి వెళ్లాం. అప్పుడు ఎన్నో పాఠశాలలు తిరిగినా ఎవరూ నాకు అడ్మిషన్ ఇవ్వలేదు. చివరకు తిరువనంతపురంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో దొరికింది.
నాన్న స్నేహితుడి సహాయంతో మరుసటి రోజే యూనిఫాం వేసుకుని నేరుగా స్కూల్‌కు వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడి నుంచే మా కొత్త జీవితం ప్రారంభమైంది' అని సంజు చెప్పుకొచ్చాడు. 'మా కుటుంబం కేరళకు రాకముందే మా నాన్న అక్కడి క్రికెట్ పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఎన్నో ఫోన్ కాల్స్ చేశారు. నాన్న స్నేహితుడు అలీ భాయ్ సూచనతో బిజూ జార్జ్ వద్ద శిక్షణ ప్రారంభించా' అని తెలిపాడు.
'మొదటి రోజు బిజూ సార్ మమ్మల్ని కేవలం 10 బంతులు మాత్రమే ఆడమన్నారు. ఆ కొద్ది సేపులోనే మా సామర్థ్యాన్ని ఆయన అంచనా వేశారు. నా అన్నను వెంటనే వయనాడ్ జిల్లా జట్టుకు పంపించారు. నేను చిన్నవాడిని కావడంతో అండర్-13 టోర్నమెంట్ కోసం సిద్ధం కావాలని చెప్పారు. ఉదయం ప్రాక్టీస్, స్కూల్.. మళ్లీ సాయంత్రం ప్రాక్టీస్.. అదే మా దినచర్య. నా కోసం నాన్న తన జీవితాన్నే మార్చుకున్నారు. నా కోసం అమ్మ ప్రతిరోజూ తన నిద్రను త్యాగం చేసేది.
వారి కష్టాలు చూసిన తర్వాత ఒక్క రోజు నిర్లక్ష్యం చేయాలనే ఆలోచన రాలేదు. నేను 30-40 పరుగులు చేసి అవుట్ అయినా ఇంటికి వెళ్లి నాన్నకు చెప్పాలంటే కాస్త బాధగా ఉండేది. కానీ అదే ఒత్తిడి నాలో అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొచ్చింది అని కచ్చితంగా చెప్తాను. నా స్నేహితులు సరదాగా క్రికెట్ ఆడితే.. నేను మాత్రం నా తల్లిదండ్రుల కలలను నిజం చేయాలనే లక్ష్యంతో ఆడేవాడిని' అని సంజు శాంసన్ తెలిపాడు.




