Sameer Rizvi: ఔరా సమీర్ రిజ్వీ, ఏమా ఆట.. టాప్ లిస్ట్‌లో చోటు!

Sameer Rizvi IPL 2026 Sensation: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వచ్చిన తర్వాత మ్యాచ్‌ల గతి ఇట్టే మారిపోతోంది.

Rishvik
Published on: 4 April 2026 8:18 PM IST
Sameer Rizvi IPL 2026 Sensation: Impact Player Record, Top Scores List and DC Star Performance
X

Sameer Rizvi 

Sameer Rizvi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వచ్చిన తర్వాత మ్యాచ్‌ల గతి ఇట్టే మారిపోతోంది. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా క్లిష్ట సమయాల్లో జట్టులోకి వచ్చి మ్యాచ్‌ను మలుపు తిప్పే ఆటగాళ్లు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ఈ జాబితాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల సమీర్‌ రిజ్వీ కూడా ఉన్నాడు. ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అసాధారణమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. లక్నోపై 70, ముంబైపై 90 రన్స్ బాదాడు. దాంతో రిజ్వీ ఇప్పుడు ఐపీఎల్ సెన్షేషన్ అయ్యాడు.

ఇంపాక్ట్ ప్లేయర్‌గా అత్యధిక స్కోర్లు చేసిన బ్యాటర్ల జాబితాలో సమీర్‌ రిజ్వీ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో సాయి సుదర్శన్ ఉన్నాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున అజేయంగా 108 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ 2024లో కోల్‌కతాపై 107* పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్ 2026లో రిజ్వీ ముంబై ఇండియన్స్‌పై 90 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగో స్థానంలో భారత ఆటగాడు కరుణ్ నాయర్ ఉన్నాడు. అతడు 2025లో ముంబైపై 89 పరుగులు చేశాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌ క్రికెట్‌ లీగ్‌లో సత్తా చాటడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 2024 వేలంలో సమీర్‌ రిజ్వీని రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. అంచనాల ఒత్తిడి కారణంగా వేలంలో పలికిన ధరకు న్యాయం చేయడంలో విఫలమయ్యాడు. ఆ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో 51 పరుగులే చేశాడు. 2024 సీజన్‌ తర్వాత రిజ్వీని చెన్నై వదిలేయడంతో.. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.95 లక్షలకే దక్కించుకుంది. 2025 ఏకైక మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 25 బంతుల్లో 58 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్ 2026లో రెచ్చిపోతున్నాడు. ఐపీఎల్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తున్నాయి. సరైన సమయంలో క్రీజులోకి వచ్చి మ్యాచ్‌ను మార్చే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు ఈ జాబితాలో చోటు దక్కించుకుంటున్నారు. రిజ్వీ లాంటి యువ ఆటగాళ్లు ఇలాగే రాణిస్తే భవిష్యత్తులో ఈ రికార్డులు మెరుగవడం ఖాయం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story