SA20 Season 5: సన్‌రైజర్స్ జట్టులోకి మార్ష్, డికాక్.. క్యాపిటల్స్ జట్టులో డేంజరస్ ప్లేయర్స్.. ప్రాంఛైజీల ఫుల్ లిస్ట్ ఇదే!
SA20 Season 5 franchises unveil retained and pre-signed players. ఎస్ఏ20 ఐదో సీజన్‌కు సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్, ప్రీ-సైనింగ్ జాబితాను ఫ్రాంచైజీలు అధికారికంగా ప్రకటించాయి.
SA20 Season 5: సన్‌రైజర్స్ జట్టులోకి మార్ష్, డికాక్.. క్యాపిటల్స్ జట్టులో డేంజరస్ ప్లేయర్స్.. ప్రాంఛైజీల ఫుల్ లిస్ట్ ఇదే!
SA20 Season 5: దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (ఎస్ఏ20) ఐదో సీజన్‌కు సంబంధించిన ప్లేయర్స్ రిటెన్షన్, ప్రీ-సైనింగ్ జాబితాను ఫ్రాంచైజీలు అధికారికంగా ప్రకటించాయి. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ సహా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్, ఆల్‌రౌండర్ సామ్ కరన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు లీగ్‌లోకి రావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అక్టోబర్ 7న జరిగే ప్లేయర్ వేలానికి ముందు ఆరు ఫ్రాంచైజీలు తమ రిటైన్, ప్రీ-సైన్ చేసిన ఆటగాళ్ల వివరాలను ఈరోజు వెల్లడించాయి. అన్ని ఒప్పందాల అనంతరం వేలంలో కేవలం 19 ఖాళీ స్థానాలే అందుబాటులో ఉన్నాయి.
ఆస్ట్రేలియా స్టార్ మిచెల్ మార్ష్ మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తరఫున తొలిసారి ఎస్ఏ20లో ఆడనున్నాడు. అతనితో పాటు 2026 సీజన్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ క్వింటన్ డి కాక్, బంగ్లాదేశ్ లెగ్ స్పిన్నర్ రిషాద్ హొస్సేన్ కూడా జట్టులో ఉన్నారు. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తలపడనుంది. ప్రిటోరియా జట్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ తొలిసారి చోటు దక్కించుకోగా.. ఫిల్ సాల్ట్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. హిట్టర్లు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డేవాల్డ్ బ్రెవిస్ సహా దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ లుంగీ ఎన్గిడి జట్టుకు అతిపెద్ద బలం.
పార్ల్ రాయల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్ ఇప్పటికే 19 మంది సభ్యులతో కూడిన పూర్తి జట్టును సిద్ధం చేసుకున్నాయి. జో రూట్ మరోసారి రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. అతనితో పాటు డేవిడ్ మిల్లర్, ఒట్నీల్ బార్ట్‌మన్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ జట్టులో ఉన్నారు. డర్బన్ జట్టులోకి సామ్ కరన్ వచ్చాడు. ఇప్పటికే ఆ జట్టులో ఎయిడెన్ మార్క్రమ్, జోస్ బట్లర్, సునీల్ నరైన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు.
ఎంఐ కేప్ టౌన్ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌తో ప్రీ-సైన్ చేసుకుంది. అతను గత మూడు సీజన్లు ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇప్పుడు కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, నికోలస్ పూరన్‌లతో కలిసి ఎంఐ కేప్ టౌన్ తరఫున జాక్స్ బరిలోకి దిగనున్నాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకుంది. అకీల్ హొసేన్, జేమ్స్ విన్స్, డోనోవన్ ఫెరెయిరా వంటి ఆటగాళ్లు కూడా జట్టులో కొనసాగారు.
అయితే ఈసారి పలు స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. జోబర్గ్ సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను విడుదల చేసింది. అతనితో పాటు లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్, వియాన్ ముల్డర్, నాండ్రే బర్గర్, డేనియల్ వొరాల్లను కూడా విడుదల చేసింది. ఎంఐ కేప్ టౌన్ రస్సీ వాన్ డర్ డుసెన్, ట్రెంట్ బౌల్ట్, కీరన్ పొలార్డ్‌లను విడుదల చేసింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జానీ బెయిర్‌స్టో సహా పలువురు విదేశీ ఆటగాళ్లను వదిలేసింది. పార్ల్ రాయల్స్ రోవ్‌మన్ పావెల్, ఈషాన్ మలింగా తదితరులను విడుదల చేయగా.. డర్బన్ సూపర్ జెయింట్స్ నూర్ అహ్మద్, డేవిడ్ వైస్‌లను వదిలేసింది.
ఐదో సీజన్ ఇప్పటివరకు అత్యంత బలమైన సీజన్‌గా నిలుస్తుందని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశారు. మిచెల్ మార్ష్, జో రూట్, సామ్ కరన్, ఫిల్ సాల్ట్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు లీగ్‌లో చేరడం SA20 అంతర్జాతీయ స్థాయిలో మరింత ఆదరణ పొందుతుందన్నారు. దక్షిణాఫ్రికా దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఈ స్టార్ క్రికెటర్లు పోటీ పడటం అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తుందని స్మిత్ పేర్కొన్నారు. SA20 సీజన్-5 జనవరి 17న గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 21న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ ముగియనుంది. అక్టోబర్ 7న జరిగే ప్లేయర్ వేలం అనంతరం అన్ని జట్ల తుది కూర్పు ఖరారు కానుంది.




