IPL 2026 : హైదరాబాద్ ఖేల్ ఖతం.. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను చితక్కొట్టిన రాజస్థాన్ రాయల్స్
IPL 2026 : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్-2 కు దూసుకెళ్లింది. వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ మెరుపులు మెరిపించారు.
RR vs SRH
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ మోస్ట్ అవైటెడ్ ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కథ ముగిసింది. ముల్లాంపూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ చావో రేవో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ను 47 పరుగుల తేడాతో ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫైయర్-2 కు దూసుకెళ్లగా.. కావ్య మారన్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. మే 29న ఇదే స్టేడియంలో జరగబోయే రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుతో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనుంది.
ఈ కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే అతని నమ్మకాన్ని వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పూర్తిగా వమ్ము చేశాడు. మైదానంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లపై వైభవ్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 16 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ మార్కుకు చేరువయ్యాడు. కానీ దురదృష్టవశాత్తూ, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసిన వేళ ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కేవలం 3 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకుని గుండె పగిలినంత పని చేసినా, రాజస్థాన్ భారీ స్కోరుకు అతడే పునాది వేశాడు.
వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ఊచకోతకు తోడుగా మిడిల్ ఆర్డర్‌లో ధ్రువ్ జురెల్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు బాది ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ లైన్‌అప్‌ను బ్రేక్ చేశాడు. ఆఖర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా తన వంతుగా 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు జోడించాడు. రాజస్థాన్ రాయల్స్ ఒక దశలో 250 పరుగుల మార్కును దాటుతుందనిపించినా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే మినహా మిగతా వారంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
244 పరుగుల అసాధ్యమైన టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రాజస్థాన్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ మొదటి ఓవర్లోనే కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తను వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ రెండో బంతికే డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మను డకౌట్ (0) చేసి పంపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా, ఆర్చర్ అతడిని అవుట్ చేశాడు. అనంతరం విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సైతం కేవలం 17 పరుగులకే అవుట్ చేసి జోఫ్రా ఆర్చర్ మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేసాడు.
టాప్ ఆర్డర్ మొత్తం పవర్‌ప్లేలోనే చేతులెత్తేయడంతో హైదరాబాద్ జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. నాండ్రే బర్గర్ బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్, యష్ రాజ్ పుంజా బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ (18) వెంటవెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. మిడిల్ ఆర్డర్‌లో నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా కొన్ని ఆకర్షణీయమైన షాట్లు ఆడి స్కోరు బోర్డును పరిగెత్తించే ప్రయత్నం చేశారు. కానీ సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఈ ఇద్దరు బ్యాటర్లను వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపి సన్‌రైజర్స్ ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాడు. చివరికి హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్లలో లక్ష్యానికి 47 పరుగుల దూరంలో నిలిచిపోవడంతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది.




