Team India: జైస్వాల్ కాదు భయ్యా.. రోహిత్ శర్మ వారసుడి రేసులో ముగ్గురు తోపులు..!

Rohit Sharma ODI Retirement: క్రికెట్ ప్రపంచంలో తనదైన పుల్ షాట్లు, విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించిన రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోనుందా అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

Venkat
Published on: 17 July 2026 7:46 PM IST
Team India
X

Team India: జైస్వాల్ కాదు భయ్యా.. రోహిత్ శర్మ వారసుడి రేసులో ముగ్గురు తోపులు..!

Rohit Sharma ODI Retirement: భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత పవర్ ఫుల్ ఓపెనర్లలో ఒకరైన రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే వార్తలు క్రీడాలోకంలో సంచలనం రేపుతున్నాయి. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరిగే మ్యాచ్ అతడికి చివరి మ్యాచ్ కానుందనే ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఊహించని ఆటగాళ్లపై సెలక్టర్ల కన్ను పడింది.

హిట్‌మ్యాన్ కెరీర్ క్లోజ్.. సెలక్టర్ల కొత్త వ్యూహం..

క్రికెట్ ప్రపంచంలో తనదైన పుల్ షాట్లు, విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించిన రోహిత్ శర్మ వన్డే కెరీర్ ముగిసిపోనుందా అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనేది రోహిత్ శర్మ కల అయినప్పటికీ, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని జాతీయ సెలక్టర్లు భావిస్తున్నారు. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేనే రోహిత్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందని సమాచారం. రోహిత్ శర్మ తప్పుకుంటే ఆ స్థానంలో యశస్వి జైస్వాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, రేసులో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరో ముగ్గురు యువ కిరణాలు నిలిచారు. ఆ ముగ్గురు సంచలన ఓపెనర్ల వివరాలు ఇవే.

1. అభిషేక్ శర్మ: పవర్‌ప్లేలో పరుగుల విధ్వంసం..

రోహిత్ శర్మ తరహాలోనే ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సత్తా ఉన్న ఆటగాడు పంజాబ్ యువ సంచలనం అభిషేక్ శర్మ. ఇప్పటికే టీ-20 ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, వన్డే ఫార్మాట్‌కు కూడా పక్కాగా సరిపోతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేయకపోయినప్పటికీ, దేశవాళీ లిస్ట్-ఎ క్రికెట్‌లో అభిషేక్ శర్మకు అద్భుతమైన రికార్డు ఉంది.

అభిషేక్ శర్మ 68 వన్డే తరహా మ్యాచ్‌లలో 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 2196 పరుగులు సాధించాడు. ఇందులో అతడి సగటు 33.78 గా ఉంది. కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా జట్టుకు ఐదో లేదా ఆరో బౌలర్ ఆప్షన్ అందించడం ఈ యువకుడికి ఉన్న అదనపు బలం.

2. వైభవ్ సూర్యవంశీ: 15 ఏళ్ల వయసులోనే అద్భుత రికార్డులు..

భారత క్రికెట్ ఫ్యూచర్ స్టార్‌గా పేరుగాంచిన బీహార్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన ఈ 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి బౌలర్లయిన జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ల బౌలింగ్‌ను సైతం లెక్కచేయకుండా బౌండరీల వర్షం కురిపించాడు.

గత ఐపీఎల్ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడమే కాకుండా, 237.31 స్ట్రైక్ రేట్‌తో అందరినీ నివ్వెరపరిచాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో భారత టీ-20 జట్టులోకి దూసుకొచ్చిన ఈ ఎడమచేతి వాటం ఓపెనర్‌ను నేరుగా వన్డే జట్టులోకి తీసుకుంటే రోహిత్ శర్మకు సరైన ప్రత్యామ్నాయం అవుతాడని భావిస్తున్నారు. యువ రక్తానికి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే సూర్యవంశీ వైపు మొగ్గు చూపడం సెలక్టర్ల సాహసోపేత నిర్ణయం కానుంది.

3. దేవదత్ పడిక్కల్: క్లాసిక్ టెక్నిక్, కొండంత నమ్మకం..

రేసులో ఉన్న మరో కీలక ఆటగాడు దేవదత్ పడిక్కల్. విజయ్ హజారే ట్రోఫీలో గత 3 సీజన్లుగా పరుగుల వరద పారిస్తూ దాదాపు 1500 పరుగులు సాధించాడు. కర్ణాటక జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన పడిక్కల్‌కు లిస్ట్-ఎ క్రికెట్‌లో సగటు ఏకంగా 82.23 గా ఉండటం విశేషం. ఇది క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ స్థాయి రికార్డును తలపిస్తోంది.

పడిక్కల్ ఇప్పటికే భారత టెస్టు, టీ-20 జట్టులో భాగమయ్యాడు. సాంకేతికంగా అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ శైలి కలిగిన పడిక్కల్, ఇన్నింగ్స్ ను నిలకడగా నిర్మించడంలో దిట్ట. మిగిలిన ఇద్దరు ఆటగాళ్లతో పోలిస్తే వన్డే ఫార్మాట్ లో ఇన్నింగ్స్ ఆరంభించడానికి పడిక్కల్ టెక్నిక్ భారత జట్టు బ్యాటింగ్ విభాగానికి మరింత పటిష్టతను చేకూరుస్తుంది.

రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం ఏ ఆటగాడికైనా అంత సులువైన విషయం కాదు. అయితే అభిషేక్ శర్మలోని దూకుడు, వైభవ్ సూర్యవంశీలోని అద్భుత ప్రతిభ, దేవదత్ పడిక్కల్‌లోని పటిష్టమైన క్లాసిక్ టెక్నిక్ భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లోనే ఉందని నిరూపిస్తున్నాయి. లార్డ్స్ వన్డే ముగిసిన తర్వాత సెలక్టర్లు యశస్వి జైస్వాల్‌తో పాటు ఈ ముగ్గురిలో ఎవరికి పెద్దపీట వేస్తారో చూడాలి.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story