Rohit Sharma: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!

Rohit Sharma: ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

Venkat
Published on: 20 July 2026 6:59 AM IST
Rohit Sharma
X

Rohit Sharma: క్రిస్ గేల్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్!

Rohit Sharma Sixes Record: ప్రపంచ క్రికెట్‌లో సిక్సర్ల రాజు అనగానే మనకు వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ గుర్తుకు వస్తాడు. కానీ ఆ రికార్డుల రారాజును సైతం వెనక్కి నెడుతూ భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో రోహిత్ శర్మ సిక్సర్ల సునామీ సృష్టించి విశ్వరూపం ప్రదర్శించాడు.

క్రిస్ గేల్ ప్రపంచ రికార్డు బద్దలు..

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో సేన (SENA - సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ పేరిట ఉన్న సుదీర్ఘ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు.

మ్యాచ్ 11వ ఓవర్లో ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా బాదిన ఒక భారీ సిక్సర్‌తో రోహిత్ ఈ అద్భుత మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం ఈ జాబితాలో రోహిత్ శర్మ 343 సిక్సర్లతో అగ్రస్థానానికి చేరుకోగా, క్రిస్ గేల్ 342 సిక్సర్లతో రెండో స్థానానికి పడిపోయాడు. మన దేశానికే చెందిన విరాట్ కోహ్లీ (179), మహేంద్ర సింగ్ ధోని (177) ఈ రేసులో చాలా వెనుకబడి ఉన్నారు.

ఇంగ్లాండ్ గడ్డపై 1500 పరుగుల అరుదైన మైలురాయి..

ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్ దేశంలో వన్డే ఫార్మాట్‌లో 1500 పరుగులు పూర్తి చేసుకున్న మొట్టమొదటి విదేశీ బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి రోహిత్‌కు 35 పరుగులు అవసరం కాగా, కేవలం 32 బంతుల్లోనే విద్వంసక ఇన్నింగ్స్‌తో ఆ మార్కును దాటేశాడు. దీనితో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా సేన (SENA) దేశాలపై 9000 పరుగులు పూర్తి చేసిన అత్యంత ప్రతిష్టాత్మక జాబితాలోనూ రోహిత్ శర్మ చేరిపోయాడు.

రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెట్టిన బీసీసీఐ..

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ, లార్డ్స్ వన్డేనే అతనికి ఆఖరి మ్యాచ్ అంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. దీనితో ఈ ఉత్కంఠభరిత పోరును అభిమానులు ఎంతో ఉద్వేగంతో వీక్షించారు. అయితే ఈ వార్తలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ ఆ పుకార్లను పూర్తిగా కొట్టిపారేశారు.

లార్డ్స్ వన్డే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కాదని, అతను మరికొన్నాళ్ల పాటు వన్డేల్లో కొనసాగుతాడని స్పష్టం చేయడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఓటమి, గెలుపుల సంగతి పక్కన పెడితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో సిక్సర్ల రారాజుగా రోహిత్ శర్మ నిలిచిన ఈ రోజు సగటు భారతీయ క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story