Rohit Sharma: ఫ్యాన్‌కు సారీ చెప్పిన రోహిత్ శర్మ

Rohit Sharma: కోల్‌కతాలో రోహిత్ శర్మను కలవలేక ఏడ్చేసిన చిన్నారి అభిమాని జినియా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Naresh.k
Published on: 24 May 2026 9:49 AM IST
Rohit Sharma
X

Rohit Sharma: ఫ్యాన్‌కు సారీ చెప్పిన రోహిత్ శర్మ

Rohit Sharma Apologizes: భారత స్టార్ క్రికెటర్, ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం సిక్సర్లతో స్టేడియంలను హోరెత్తించడమే కాదు, అభిమానుల హృదయాలను గెలుచుకోవడంలోనూ హిట్ మ్యాన్ అనిపించుకున్నారు. ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల హడావుడిలోనూ ఒక సాధారణ చిన్నారి అభిమాని కోసం ఆయన స్పందించిన తీరు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల మనసులను దోచుకుంటోంది. తాజాగా కోల్‌కతాలో జరిగిన ఒక సంఘటన.. రోహిత్ శర్మకు ఉన్న అపారమైన ఫ్యాన్ బేస్‌తో పాటు ఆయనకున్న గొప్ప మనసును చాటిచెప్పింది.

ఈడెన్ గార్డెన్స్ వెలుపల ఏం జరిగింది?

ఇటీవల కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌, ముంబయి ఇండియన్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు బస చేసిన హోటల్ వెలుపల రోహిత్ శర్మను ఒక్కసారైనా చూడాలని, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలని జినియా అనే ఒక చిన్నారి గంటల తరబడి వేచి చూసింది. రోహిత్ శర్మ హోటల్ నుండి బయటకు రాగానే.. ఆ చిన్నారి ఎంతో ఆశగా రోహిత్ భాయ్.. రోహిత్ భాయ్ అంటూ గట్టిగా అరిచింది. కానీ, అక్కడ ఉన్న భారీ జనసందోహం, మితిమీరిన అరుపులు, శబ్దాల కారణంగా రోహిత్ ఆమె పిలుపును గమనించకుండానే ముందుకు సాగిపోయారు. గంటల తరబడి వేచి చూసినా తన అభిమాన క్రికెటర్‌ను కలవలేకపోయాననే నిరాశతో ఆ చిన్నారి అక్కడే కన్నీరు పెట్టుకుంది. దీనికి సంబంధించిన ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, అది కాస్తా హిట్‌మ్యాన్ దృష్టికి చేరింది.

చలించిపోయిన రోహిత్..

తన కోసం ఓ చిన్నారి అభిమాని ఏడవడం చూసి చలించిపోయిన రోహిత్ శర్మ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ఆ చిన్నారికి క్షమాపణలు చెప్పారు. ఒక గ్లోబల్ స్టార్ ఇలా రియాక్ట్ అవ్వడం ఎవరూ ఊహించలేదు. హాయ్ జినియా.. ఈడెన్ గార్డెన్స్‌లో నిన్ను కలవలేకపోయినందుకు నన్ను క్షమించు. నీ వీడియో చూశాను, నువ్వు ఏడవడం నాకు చాలా బాధేసింది. అక్కడ జనం విపరీతంగా ఉండటం వల్ల ఎవరు పిలుస్తున్నారో గుర్తుపట్టడం, ఆ శబ్దంలో వినడం కష్టంగా ఉంటుంది. అందుకే నేను గమనించకుండా వెళ్లిపోయాను. కానీ, ప్రామిస్.. తదుపరిసారి నేను కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌కు వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా కలుస్తాను. ఆల్‌ ది బెస్ట్ అంటూ రోహిత్ శర్మ ఓ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెటర్లలో ఒకరై ఉండి, అంత బిజీ షెడ్యూల్‌లోనూ ఒక సాధారణ అభిమాని కన్నీళ్లకు విలువనిచ్చి క్షమాపణలు చెప్పడం రోహిత్ సంస్కారానికి నిదర్శనమని కొనియాడుతున్నారు. మైదానంలోనే కాదు.. నిజ జీవితంలోనూ నువ్వు కెప్టెన్ భాయ్, ఇందుకే నిన్ను అందరూ అంతగా ప్రేమిస్తారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story