Rishabh Pant: రెండో రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా?.. టీమిండియా కోచ్ సమాధానం ఇదే!
Rishabh Pant: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో మొదటి రోజు ఆటలో మైదానాన్ని వీడాడు.
Rishabh Pant: రెండో రోజు రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తాడా?.. టీమిండియా కోచ్ సమాధానం ఇదే!
Rishabh Pant: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాకు షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో మొదటి రోజు ఆటలో మైదానాన్ని వీడాడు. శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన బంతి పంత్ ఎడమ చేతి మణికట్టుకు బలంగా తగలడంతో.. అతడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. చేతికి గాయం కావడంతో రిషభ్ పంత్ (3) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే మ్యాచ్ అనంతరం పంత్ గాయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
ఆట చివరి సెషన్‌లో లహిరు కుమార బౌలింగ్‌కు వచ్చాడు. 58వ ఓవర్ తొలి బంతిని కుమార షార్ట్ పిచ్ బంతిగా సంధించాడు. ఆ బంతి పంత్ శరీరం వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని స్క్వేర్ లెగ్ వైపు పుల్ చేయడానికి పంత్ ప్రయత్నించాడు. అయితే షాట్‌ను కాస్త ముందుగానే ఆడటంతో బంతి అతడి ఎడమ మణికట్టును బలంగా తాకింది. వెంటనే పంత్ నొప్పితో మైదానంలో కూర్చుండిపోయాడు. భారత జట్టు ఫిజియో కమలేశ్ జైన్ మైదానంలోకి వచ్చి పంత్‌కు చికిత్స అందించారు. వాపు రాకుండా ఉండేందుకు ఐస్ ప్యాక్‌తో చికిత్స చేశారు. అనంతరం పంత్ మణికట్టుకు టేపింగ్ కూడా చేశారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో అంపైర్లతో చర్చించిన తర్వాత పంత్ మైదానం వీడాల్సి వచ్చింది.
గాయంతో మైదానం నుంచి బయటకు వెళ్లే సమయానికి రిషబ్ పంత్ 15 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. అతడి స్థానంలో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మరో ఎండ్‌లో అప్పటికే అర్ధశతకం పూర్తి చేసిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరు కలిసి జట్టుకు విలువైన పరుగులు జోడించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి భారత్ 300 పరుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (7), సారాంశ్ జైన్ (4) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. రవీంద్ర జడేజా (43; 83 బంతుల్లో) పెవిలియన్ చేరాడు. పడిక్కల్ (117; 193 బంతుల్లో) ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ (18) నిరాశపర్చాడు. శుభ్‌మన్ గిల్ (50), యశస్వి జైస్వాల్ (45) రాణించారు.
అయితే రిషబ్ పంత్ గాయం టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేయగా.. ఆట ముగిసిన అనంతరం బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ శుభవార్త చెప్పాడు. రెండో రోజు అవసరమైతే పంత్ బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడని స్పష్టం చేశాడు. 'రిషభ్ పంత్ రేపు బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు' అని కోటక్ వెల్లడించాడు. రెండో టెస్టు తొలి రోజు భారత్ 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. అతడు 117 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 50 పరుగులు చేయగా.. యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా రాణించారు. పంత్ గాయం పెద్ద సమస్య కాకపోతే రెండో రోజు అతడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. పంత్ మణికట్టు పరిస్థితి, అతడి ఫిట్‌నెస్‌ను భారత జట్టు మేనేజ్‌మెంట్ ఎలా అంచనా వేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే కోచ్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో టీమిండియా అభిమానులకు కొంత ఊరట లభించింది.




