RCB-IPL 2026: ఐపీఎల్‌‌లో ఆడొద్దన్నారని కోర్టుకెక్కిన ఆర్సీబీ పేసర్.. రిటైర్‌మెంట్‌ ఇస్తా అంటూ బెదిరింపులు!

RCB Pacer Nuwan Thushara Case: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు.

Rishvik
Published on: 2 April 2026 10:02 PM IST
RCB Pacer Nuwan Thushara Files Case Over IPL 2026 NOC Denial, Threatens International Retirement
X

RCB-IPL 2026: ఐపీఎల్‌‌లో ఆడొద్దన్నారని కోర్టుకెక్కిన ఆర్సీబీ పేసర్.. రిటైర్‌మెంట్‌ ఇస్తా అంటూ బెదిరింపులు!

RCB Pacer Nuwan Thushara Case: శ్రీలంక ఫాస్ట్ బౌలర్ నువాన్ తుషార సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో తుషార కోర్టును ఆశ్రయించాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతడు కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ఇస్తా అంటూ బెదిరింపులు కూడా పాల్పడినట్లు సమాచారం. తుషార కోర్టును ఆశ్రయించడం క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది.

గతేడాది ఐపీఎల్‌లో నువాన్ తుషారను ఆర్సీబీ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. రిపోర్టుల ప్రకారం.. ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమవడంతో తుషారకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎన్ఓసీ (నిరభ్యంతర పత్రం) నిరాకరించింది. ఇది చాలా అన్యాయమని తుషార కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తన ఫిట్‌నెస్ స్థాయి గతంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందని, అప్పట్లో ఎటువంటి సమస్యలు రాలేదని పేర్కొన్నాడు. తాను ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతించేలా బోర్డును ఆదేశించాలని కేసు పత్రాల్లో తుషార పేర్కొన్నాడని అక్కడి మీడియా అంటోంది. ఈ కేసులో శ్రీలంక క్రికెట్ అధ్యక్షుడు షమ్మి సిల్వా, కార్యదర్శి బండుల దిస్సానాయకే, సీఈఓ అశ్లీ డి సిల్వా వంటి కీలక అధికారులను ప్రతివాదులుగా చేర్చినట్లు సమాచారం. ఈ కేసు విచారణ ఏప్రిల్ 9న కొలంబో జిల్లా కోర్టులో జరగనుంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. నువాన్‌ తుషారా తన సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కొనసాగించబోనని శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఇప్పటికే తెలియజేసినట్లు సమాచారం. ఎస్‌ఎల్‌సీతో తన కాంట్రాక్ట్ మార్చి 31 వరకే ఉందని.. దానిని పునరుద్ధరించుకోవాలనుకోవడం లేదని లంక బోర్డుకు వెల్లడించినట్లు తెలుస్తోంది. తాను అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ కావాలని అనుకుంటున్న విషయాన్ని ఇప్పటికే బోర్డుకు తెలియజేశాడట. ఐపీఎల్‌లో ఆడేందుకు అవకాశం కోల్పోతే.. ఆర్థికంగా, కెరీర్ పరంగా తనకు పెద్ద నష్టం వాటిల్లుతుందని తుషారా కోర్టుకు వివరించినట్లు తెలుస్తోంది. తుషారా తీసుకున్న ఈ న్యాయపరమైన చర్య క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమవుతుండగా.. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్నది ఆసక్తిగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story