RCB-IPL 2026: ఆర్‌సీబీకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 మధ్యలోనే స్వదేశానికి మ్యాచ్ విన్నర్!

RCB star Phil Salt returns to the UK. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ షాక్ తగిలింది.

Rishvik
Published on: 4 May 2026 4:11 PM IST
RCB-IPL 2026
X

RCB-IPL 2026

RCB-IPL 2026: డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కి ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ షాక్ తగిలింది. జట్టు ఓపెనర్ ఫీల్ సాల్ట్ గాయం కారణంగా సీజన్‌ మధ్యలోనే యూకేకు తిరిగి వెళ్లాడు. అతని ఎడమ చేతి వేళ్లకు గాయం కావడంతో స్కాన్ల కోసం స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం. గత మూడు మ్యాచ్‌లకు దూరమైన సాల్ట్.. మరిన్ని మ్యాచ్‌లకు జట్టుకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ గాయంపై ఆర్సీబీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.

ఏప్రిల్ 18న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సమయంలో ఫిల్ సాల్ట్ వేలికి గాయమైంది. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద బంతిని ఆపేందుకు ప్రయత్నించే క్రమంలో అతడి వేళ్లకు గాయమైంది. ఆ తర్వాత అతడు మైదానంలోకి దిగలేదు. గాయానికి సంబంధించి టెస్టు కోసం అతడు యూకే వెళ్లాడు. స్కానింగ్‌ రిపోర్ట్స్ అనంతరం పరిస్థితిని బట్టి సాల్ట్ ఆర్‌సీబీ జట్టుతో చేరతాడు. ఒకవేళ శస్త్రచికిత్స అవసరమైతే మాత్రం ఐపీఎల్ 2026 నుంచి వైదొలిగినట్లే. బెంగళూరుకు కీలక సమయంలో సాల్ట్ దూరమయ్యాడు.

ఈ సీజన్ ప్రారంభంలో ఫిల్ సాల్ట్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 168.33 స్ట్రైక్ రేట్‌తో 202 పరుగులు చేశాడు. తన దూకుడైన ఆటతో ఆర్‌సీబీకి మెరుపు ఆరంభాలు అందించాడు. అతని గైర్హాజరీలో ప్రస్తుతం జాకబ్ బెథెల్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు. బెతెల్ పెద్దగా ప్రభావం చూపించడం లేదు. గత మూడు మ్యాచుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. అయితే సాల్ట్ గాయం త్వరగా నయమై ఈ నెలాఖరుకల్లా తిరిగి జట్టుతో చేరతాడని ఆర్‌సీబీ యాజమాన్యం ఆశాభావంతో ఉంది. గత సీజన్‌లో తొలిసారి టైటిల్ గెలిచిన ఆర్‌సీబీ.. ఈసారి కూడా ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం కెప్టెన్ రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్‌సీబీ దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచులలో ఆరు విజయాలు అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. మిగిలిన 5 మ్యాచులలో రెండు విజయాలు సాధిస్తే ప్లేఅఫ్ బెర్త్ దక్కుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ అనంతరం ఆర్‌సీబీకి ఆరు రోజుల విరామం దక్కింది. ఈ బ్రేక్ సమయంలో కొంతమంది ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్నారు. తదుపరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఎదుర్కోనుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story