Ravindra Jadeja: ఎంఎస్ ధోనీతో మాట్లాడలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన జడేజా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌కు ముందు ఆర్ జడేజా-ఎంఎస్ ధోనీ మాట్లాడుకుంటారని అందరూ ఎదురుచూసినా.. అది జరగలేదు. దీనిపై జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ravindra Jadeja
Ravindra Jadeja: ఐపీఎల్‌లో ఆటగాళ్లు జట్లు మారడం సహజమే అయినప్పటికీ.. స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌ను విడిచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్ 2026లో ఆడటం అభిమానులకు కాస్త విచిత్రంగా అనిపించింది. 2012 నుంచి 2025 వరకు 13 సంవత్సరాల పాటు సీఎస్‌కేకు ఆడిన జడేజా.. ఆ జట్టుకు మూడు టైటిళ్లు (2018, 2021, 2023) అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి జడ్డు సోమవారం తన పాత జట్టు సీఎస్‌కేకు ప్రత్యర్థిగా ఆడటం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శనతో చెన్నైపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా.. బౌలింగ్‌లో మాయాజాలం చూపాడు. మూడు ఓవర్లలో 18 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. టాప్ క్లాస్ బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబేలను ఔట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. మ్యాచ్ సమయంలో జడ్డు కాస్త భావోద్వేగానికి కూడా గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన పాత జట్టు చెన్నైపై బౌలింగ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించిందని మ్యాచ్ అనంతరం జడేజా చెప్పాడు.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆర్ జడేజా-ఎంఎస్ ధోనీ మాట్లాడుకుంటారని అందరూ ఎదురుచూసినా.. అది జరగలేదు. దీనిపై జడేజా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'సీఎస్‌కే నుంచి వెళ్లిపోయిన తర్వాత మాహీ భాయ్‌తో నేను ఇంకా మాట్లాడలేదు. ఆయన ఫోన్ ఎక్కువగా ఆఫ్‌లోనే ఉంటుంది. కానీ కలిసినప్పుడు తప్పకుండా మాట్లాడుతాను' అని జడేజా తెలిపాడు. అలాగే సురేష్ రైనా, అనిల్ కుంబ్లే వంటి మాజీ క్రికెటర్లతో కూడా త్వరలో మాట్లాడతానని చెప్పాడు.
ఇక కొత్త జట్టుకు మారడం మొదట్లో కాస్త భావోద్వేగంగా అనిపించిందని, అయితే ఇది క్రికెట్ ప్రయాణంలో భాగమని జడేజా అంగీకరించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, మళ్లీ ఆ జట్టులో చేరడం సంతోషంగా ఉందని చెప్పాడు. కొత్త జట్టులోని ఆటగాళ్లతో కలిసిపోతూ.. తన అనుభవాన్ని పంచుకోవడమే లక్ష్యమని జడేజా స్పష్టం చేశాడు. జడేజా కొత్త జట్టులోకి మారినా తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక ముందు మ్యాచ్‌ల్లో అతని ఆల్‌రౌండ్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.




