Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన రవిచంద్రన్ అశ్విన్.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!

Ravichandran Ashwin Creates History: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో ఆడనున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

Rishvik
Published on: 28 March 2026 8:44 PM IST
Ravichandran Ashwin Creates History: First Indian to Play in Major League Cricket
X

Ravichandran Ashwin Creates History

Ravichandran Ashwin Creates History: భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలో జరిగే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)లో ఆడనున్న తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2026 సీజన్ కోసం శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుతో అశ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అశ్విన్‌కు ఇది రెండో విదేశీ టీ20 లీగ్. బిగ్ బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంపై యాష్ స్పందించాడు.

ఆర్ అశ్విన్ మాట్లాడుతూ... 'ఎంఎల్‌సీ గత కొన్ని సీజన్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఆడుతున్నారు. దాంతో ఈ లీగ్‌ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎంఎల్‌సీ లీగ్‌లో భాగమవడం గొప్ప అవకాశం. తొలి భారత ఆటగాడిగా ఆడటం ఓ బాధ్యతగా భావిస్తున్నాను. శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టుకు విజయాలు అందించడం నా ప్రధాన లక్ష్యం' అని చెప్పాడు. 2023లో జరిగిన తొలి ఎడిషన్ నుంచే యూనికార్న్స్ జట్టుతో ఉన్న పాకిస్థాన్ పేసర్ హారిస్ రౌఫ్‌తో కలసి అశ్విన్ ఆడనున్నాడు.

సాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్ హెడ్ కోచ్ కెమెరాన్ వైట్ మాట్లాడుతూ... 'ఆర్ అశ్విన్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు జట్టులో ఉండడం మా అదృష్టం. అతని అనుభవం, మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది' అని అన్నారు. జూన్ 19న లాస్ ఏంజిల్స్ నైట్ రీడర్స్ జట్టుతో తమ తొలి మ్యాచ్ యూనికార్న్స్ ఆడనుంది. జూలై 18న ఓక్లాండ్ కొలీసియంలో జరిగే ఫైనల్‌తో సీజన్‌ను ముగించనుంది. మార్చి 26న రాబోయే సీజన్ కోసం మాట్ షార్ట్, ఫిన్ అలెన్, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కానలీ, హారిస్ రౌఫ్, సంజయ్ కృష్ణమూర్తి, హసన్ ఖాన్, బ్రాడీ కౌచ్, హమ్మద్ అజామ్, జువానోయ్ డ్రైస్‌డేల్‌లను నిలుపుకున్నట్లు యునికార్న్స్ ప్రకటించింది.

ఆర్ అశ్విన్ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 2011 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో భాగమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 287 మ్యాచ్‌ల్లో 765 వికెట్లు తీసి అద్భుత రికార్డు సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్ స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లో కూడా అశ్విన్ అద్భుత ప్రదర్శనలు చేశాడు. చెన్నై, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల బిగ్ బాష్ లీగ్ 2025-26లో సిడ్నీ థండర్ తరఫున ఆడాల్సి ఉండగా గాయం కారణంగా దూరమయ్యాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story