Rohit Sharma: రోహిత్‌పై అలాంటి వార్హలు రావడం బాధాకరం.. హిట్‌మ్యాన్ ఇంకేం నిరూపించుకోవాలి!

Rohit Sharma: Ravi Shastri backs Rohit Sharma after his brilliant 138 at Lord's. లార్డ్స్ వన్డేలో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన అద్భుత సెంచరీ మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది.

Rishvik
Published on: 21 July 2026 6:23 PM IST
Rohit Sharma
X

Rohit Sharma: రోహిత్‌పై అలాంటి వార్హలు రావడం బాధాకరం.. హిట్‌మ్యాన్ ఇంకేం నిరూపించుకోవాలి!

Rohit Sharma: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. అయితే లార్డ్స్ వన్డేలో సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన అద్భుత సెంచరీ మాత్రం క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. తన భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల మధ్య 110 బంతుల్లో 138 పరుగులు బాదిన హిట్‌మ్యాన్.. విమర్శకులకు గట్టి సమాధానం ఇచ్చాడు. రోహిత్ ఇన్నింగ్స్‌పై ఇప్పటికే మాజీలు అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా రోహిత్‌ను ఆకాశానికి ఎత్తేశాడు. ఒక్క సెంచరీతో హిట్‌మ్యాన్ అందరి నోళ్లు మూయించాడన్నాడు.

స్కై స్పోర్ట్స్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ ఎవరికీ ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ అతను తన సెంచరీతో అన్ని ఊహాగానాలకు తెరదించాడు. ఒక ఆటగాడు ఎన్నో సంవత్సరాలుగా దేశానికి సేవ చేసిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం రావడం కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది. రోహిత్‌కు ఇంకా ఆడాలనే కోరిక, కష్టపడాలనే తపన ఉంటే.. అతను ఆడాలనుకున్నంత కాలం జట్టులో అవకాశం ఇవ్వాలి. తాను ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కే బాగా తెలుసు. బయటి నుంచి విమర్శలు ఆపండి. ఓ బ్యాటర్ ప్రతి మ్యాచులో సెంచరీ చేయలేడు' అని అన్నాడు.

లార్డ్స్‌లో వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడని రవిశాస్త్రి గుర్తుచేశాడు. 'రోహిత్ లార్డ్స్‌లో వన్డేల్లో సెంచరీ బాదాడు. ఇపప్టివ్రకు ఓ టీమిండియా బ్యాటర్ లార్డ్స్‌లో శతకం చేయలేదు. ఇలాంటి ఆటగాడిని తప్పించాలని ఆలోచిస్తున్న సమయంలోనే రోహిత్ మేటి ఇన్నింగ్స్ ఆడి తన గొప్పతనం మరోసారి చాటుకున్నాడు. ఇది నిజంగా ప్రత్యేకమైన ఇన్నింగ్స్' అని కొనియాడాడు. 'రోహిత్, విరాట్ కోహ్లీ ఇద్దరూ 40-50 పరుగులు దాటిన తర్వాత భారీ స్కోర్లు చేస్తారు. క్రీజులో నిలదొక్కుకుంటే మ్యాచ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో వారికి బాగా తెలుసు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 130-140 పరుగుల భారీ ఇన్నింగ్స్ అవసరం. రోహిత్ ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు. శుభ్‌మన్ గిల్, కోహ్లీ కూడా మంచి సహకారం అందించారు. కానీ 388 పరుగుల లక్ష్యం చాలా పెద్దది' అని రవిశాస్త్రి విశ్లేషించాడు.

భారత్ ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలేనని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'చివరి ఓవర్లలో బౌలర్లు భారీగా పరుగులు సమర్పించడం జట్టుకు పెద్ద సమస్యగా మారింది. జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ బౌలర్ లేకపోవడం భారత్‌కు పెద్ద లోటు. గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్లకు అవకాశాలు ఇవ్వడం మంచి విషయమే. కానీ వారికి మరింత అనుభవం అవసరం. చివరి ఓవర్లలో జోస్ బట్లర్ దూకుడుగా ఆడినప్పుడు యువ బౌలర్లు ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో బుమ్రా ఉంటే తన మూడు లేదా నాలుగు ఓవర్లతో మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేవాడు' అని అభిప్రాయపడ్డాడు.

లార్డ్స్‌లో తొలి అంతర్జాతీయ అర్ధశతకం నమోదు చేసిన విరాట్ కోహ్లీపై కూడా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. 'విరాట్‌లో ఆకలి, జట్టుపై అంకితభావం, ఆటపై ఉన్న ప్యాషన్ ఇప్పటికీ తగ్గలేదు. మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అతను తీసుకొచ్చే ఎనర్జీకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి ఆటగాళ్లు జట్టుకు ఎప్పుడూ ప్రత్యేకమే. విరాట్ గొప్ప ఆటగాడు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story