RR vs RCB : వైభవ్ సునామీ.. జురెల్ మెరుపులు..ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
RR vs RCB మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం. వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లో ఫిఫ్టీ, ధ్రువ్ జురెల్ 81 రన్స్‌తో విధ్వంసం. వరుసగా నాలుగో విజయం సాధించిన రాయల్స్.
RR vs RCB
RR vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తమ విజయ పరంపరను కొనసాగిస్తూ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు భారీ స్కోరు సాధించినప్పటికీ, రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టించిన సునామీ ముందు అది ఏమాత్రం సరిపోలేదు. గౌహతిలో వర్షం కారణంగా మ్యాచ్ 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. విరాట్ కోహ్లీ (32) పర్వాలేదనిపించినా, మిగిలిన టాప్ ఆర్డర్ విఫలమవడంతో ఒక దశలో ఆర్సీబీ 94 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. 63 పరుగులతో ధాటిగా ఆడి జట్టు స్కోరును 201 పరుగుల భారీ స్థాయికి చేర్చాడు.
202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (13) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఆ తర్వాత వచ్చిన 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటకు అడ్డులేకుండా పోయింది. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్, పవర్ ప్లే ముగిసేసరికే జట్టు స్కోరును 97కు చేర్చాడు. అతను కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి (8 ఫోర్లు, 7 సిక్సర్లు) అవుటయ్యాడు. వైభవ్, ధ్రువ్ జురెల్ కలిసి కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మ్యాచ్‌కే హైలైట్.
వైభవ్ అవుటైన తర్వాత, అదే ఓవర్లో హిట్ మెయిర్ డకౌట్ కావడంతో రాజస్థాన్ కాస్త ఒత్తిడికి లోనైంది. కేవలం 5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన సమయంలో ధ్రువ్ జురెల్ బాధ్యత తీసుకున్నాడు. బెంగళూరు బౌలర్లను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డ జురెల్, 43 బంతుల్లో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా సమయోచితంగా ఆడి జురెల్ కు మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యంతో రాజస్థాన్‌ను 18 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు.
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా మారారు. ఆర్సీబీ బౌలర్లు మొహమ్మద్ సిరాజ్, జోష్ హెజిల్వుడ్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, రాజస్థాన్ బ్యాటర్ల జోరును అడ్డుకోలేకపోయారు. వర్షం కారణంగా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో పరుగుల వరద పారింది.




