Team India: టీమిండియా వెనుకబడింది, ఇక కష్టమే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!

Team India: డబ్ల్యూటీసీ 2025-27 పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. మిగిలిన 8 టెస్టుల్లో దాదాపు ఆరు మ్యాచ్‌లు గెలవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.

Rishvik
Published on: 25 Aug 2026 6:35 PM IST
Team India
X

Team India: టీమిండియా వెనుకబడింది, ఇక కష్టమే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!

Team India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27లో ఆస్ట్రేలియా తన అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ.. పర్సంటేజీని కూడా పెంచుకుంది. తాజాగా బంగ్లాదేశ్‌పై విజయం అనంతరం ఆసీస్ 96 పాయింట్లకు చేరుకుంది. డబ్ల్యూటీసీ టేబుల్లో ప్రస్తుతం ఆసీస్ తరువాత దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్, బంగ్లాదేశ్‌, భారత్ వరుసగా ఉన్నాయి.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా ఇకపై ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్.. మిగిలిన 8 టెస్టుల్లో దాదాపు ఆరు మ్యాచ్‌లు గెలవాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. భారత్ ఫైనల్‌కు చేరాలంటే పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉందని పేర్కొన్నాడు.

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత్ ఆరంభం చేయడం సానుకూల అంశమని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులోనూ భారత జట్టు పైచేయి సాధించింది. అయితే ఈ విజయాలు మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు సరిపోవని, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ నిలకడైన ప్రదర్శన అవసరమని ద్రవిడ్ సూచించాడు.

'డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్‌కు ఫైనల్ చేరే మార్గం కాస్త కఠినంగానే ఉంది. టాప్-2లో నిలిచిన జట్లు మాత్రమే వచ్చే ఏడాది ఫైనల్‌లో తలపడతాయి. భారత్ మిగిలిన ఎనిమిది టెస్టుల్లో మెజారిటీ మ్యాచ్‌లను గెలవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో భారత్ కొంత వెనుకబడింది. అయినప్పటికీ భారత జట్టులో ఉన్న ప్రతిభను దృష్టిలో పెట్టుకుంటే.. ఇప్పుడే జట్టును ఫైనల్ రేసు నుంచి తప్పుకుందని అనలేం' అని స్పష్టం చేశాడు.

శ్రీలంక సిరీస్ తర్వాత భారత్‌కు న్యూజిలాండ్ పర్యటన అసలు పరీక్షగా మారనుంది. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌లో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. 'సొంత గడ్డపై న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం ఎప్పుడూ సవాలే. ముఖ్యంగా భారత యువ ఆటగాళ్లలో చాలామంది న్యూజిలాండ్ పరిస్థితుల్లో టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడం జట్టుకు పెద్ద సవాల్‌గా మారుతుంది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా వంటి సీనియర్ ప్లేయర్స్ జట్టులో లేకపోవడం కూడా ప్రభావం చూపుతుంది. గతంలో న్యూజిలాండ్‌లో ఆడిన అనుభవం ఉన్న ఈ ఆటగాళ్లు ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో.. యువ ఆటగాళ్లపై అదనపు బాధ్యత పడుతుంది. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండటం, గాయాలకు గురికాకుండా ఉండటం రాబోయే నెలల్లో చాలా కీలకం' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.

న్యూజిలాండ్ పర్యటన అనంతరం భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడనుంది. జనవరి 2027లో జరగనున్న ఈ సిరీస్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కీలక పాత్ర పోషించనుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌లో బాగా రాణించాలని ఎంతో ఆసక్తిగా ఉంటారని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. ఎప్పటిలానే భారత్‌లో టెస్ట్ సిరీస్ అందుకోవాలని ఆస్ట్రేలియా బరిలోకి దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు.

న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా సిరీస్లను భారత్ గెలిస్తే ఫైనల్ చేరుతుందని ద్రవిడ్ చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరేందుకు టీమిండియా ముందు కఠినమైన మార్గమే ఉంది. శ్రీలంకపై సిరీస్‌ను విజయంతో ముగించడం, న్యూజిలాండ్‌లో కఠినమైన పరిస్థితులను అధిగమించడం, ఆస్ట్రేలియాపై స్వదేశంలో ఆధిపత్యం ప్రదర్శించడం భారత్‌కు అత్యంత కీలకం.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story