Rahul Dravid: ఫ్రాంచైజీ యజమానిగా ద్రవిడ్.. కెప్టెన్ అశ్విన్, లీగ్ ఓనర్ స్టార్ హీరో!

Rahul Dravid: భారత క్రికెట్ దిగ్గజం, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త పాత్రలో కనిపించబోతున్నారు.

Rishvik
Published on: 12 May 2026 6:40 PM IST
Rahul Dravid
X

Rahul Dravid: ఫ్రాంచైజీ యజమానిగా ద్రవిడ్.. కెప్టెన్ అశ్విన్, లీగ్ ఓనర్ స్టార్ హీరో!

Rahul Dravid: భారత క్రికెట్ దిగ్గజం, ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ మరో కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. యూరప్‌లో త్వరలో ప్రారంభం కానున్న యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌ (ఈటీపీఎల్)లో డబ్లిన్ ఫ్రాంచైజీ యాజమాన్య హక్కులను చేజిక్కించుకున్నారు. 2026లో ప్రారంభం కానున్న ఈ లీగ్‌కు సంబంధించిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఈటీపీఎల్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. ఈటీపీఎల్ సహ యజమాని, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. ద్రవిడ్ లాంటి వ్యక్తిని ఈ లీగ్‌కు తీసుకురావడానికి ప్రధాన కారణం అతడి విశ్వసనీయత, దూరదృష్టి అని తెలిపారు.

‘రాహుల్ ద్రావిడ్ ఏ పని చేసినా దానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఆయన లాంటి వ్యక్తి లీగ్‌తో కలిస్తే క్రికెట్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది’ అని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఈ లీగ్‌లో భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా కీలక పాత్ర పోషించనున్నాడు. డబ్లిన్ ఫ్రాంచైజీకి కెప్టెన్, మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత యూరప్‌లో క్రికెట్ ఆడేందుకు అశ్విన్‌కుఅవకాశం దక్కింది. డబ్లిన్ ఫ్రాంచైజీకి 'డబ్లిన్ గార్డియన్స్' అని పేరు పెట్టారు.

యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌ను క్రికెట్‌ ఐర్లాండ్‌, క్రికెట్‌ స్కాట్లాండ్‌, రాయల్‌ డచ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. డబ్లిన్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, గ్లాస్గో, రోటర్‌డామ్, ఆమ్స్‌టర్‌డామ్ నగరాల ఆధారంగా మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఈ లీగ్‌లో పాల్గొననున్నాయి.

యూరప్‌లో క్రికెట్‌ను మరింత విస్తరించడమే ఈటీపీఎల్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం, స్థానిక స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చేయడం ఈ లీగ్ ఉద్దేశమని అభిషేక్ బచ్చన్ వెల్లడించాడు. ‘స్టీవ్ వా, జాంటీ రోడ్స్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాలు ఈ లీగ్‌తో కలవడం ఈటీపీఎల్ విజన్‌ను చూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.

రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘యూరప్‌లో క్రికెట్ అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక విజన్‌ నన్ను ఆకర్షించింది. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం నాకు ఎప్పుడూ ఇష్టమే. డబ్లిన్‌లో ఇప్పటికే మంచి క్రికెట్ కమ్యూనిటీ ఉంది. భవిష్యత్తులో ఈ లీగ్ యూరప్ క్రికెట్‌కు కీలక వేదికగా మారుతుంది’ అని తెలిపాడు. 2026 ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరిగే ఈటీపీఎల్ 2026లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.

యూరప్ క్రికెట్‌లో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఈ లీగ్‌లో ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు చేరడం విశేషం. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మిచెల్ సాంట్నర్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డు ప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లు పెట్టుబడిదారులు లేదా ప్లేయర్లుగా లీగ్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story