PBKS vs RCB: వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం.. పంజాబ్ ముందు టఫ్ టార్గెట్, గెలిస్తేనే నిలిచేది!

Venkatesh Iyer smashed an unbeaten 73. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు నమోదు చేసింది.

Rishvik
Published on: 17 May 2026 5:41 PM IST
PBKS vs RCB
X

PBKS vs RCB: వెంకటేశ్ అయ్యర్ విధ్వంసం.. పంజాబ్ ముందు టఫ్ టార్గెట్, గెలిస్తేనే నిలిచేది!

PBKS vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌ (పీబీకేఎస్)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) భారీ స్కోరు నమోదు చేసింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ ముందు 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లీ (58) హాఫ్ సెంచరీ బాదాడు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 2 వికెట్స్ తీయగా.. అర్ష్‌దీప్‌ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌కు జాకబ్ బెథెల్, విరాట్ కోహ్లీలు శుభారంభం అందించారు. అయితే బెతెల్ 7 బంతుల్లో 11 పరుగులు చేసి హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కోహ్లీ తన అనుభవంతో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 37 బంతుల్లో 58 పరుగులు చేసిన కోహ్లీ.. నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ వేగంగా ఆడాడు. 25 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. పడిక్కల్ ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. అయితే పడిక్కల్ కూడా హర్‌ప్రీత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్ అసలు సిసలైన విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే అజేయంగా 73 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, నాలుగు భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో టిమ్‌ డేవిడ్ కూడా మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 28 పరుగులు చేసిన డేవిడ్.. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అయ్యర్-డేవిడ్ జోడీ నాలుగో వికెట్‌కు వేగంగా పరుగులు జోడించి ఆర్సీబీ స్కోరును 220 దాటించింది. చివరి ఓవర్ వేసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ 14 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ బాగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్స్ పడగొట్టాడు. అర్ష్‌దీప్‌, చాహల్ తలో వికెట్ తీసినా భారీగా రన్స్ ఇచ్చారు. మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో పంజాబ్‌ ముందు భారీ లక్ష్యం ఉంది. ఇప్పుడు 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన కింగ్స్‌పై ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలవడం తప్పనిసరి. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే విజయం సాదించాల్సిందే. మరోవైపు గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story