PBKS vs MI: హార్దిక్, సూర్యకుమార్ కాదు.. ముంబైకు కొత్త కెప్టెన్?
PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.
PBKS vs MI: హార్దిక్, సూర్యకుమార్ కాదు.. ముంబైకు కొత్త కెప్టెన్?
PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ముంబై ఇండియన్స్ (ఎంఐ)కు మరో భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబై.. ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో కూడా అనిశ్చితిని ఎదుర్కొంటోంది. పంజాబ్ కింగ్స్‌తో ఈరోజు ధర్మశాలలో జరగనున్న మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అందుబాటులో లేకపోవచ్చని సమాచారం. కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై జట్టును కొత్త కెప్టెన్ నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి.
హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి (బ్యాక్ స్పాసమ్) కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించాడు. అయితే ఇప్పుడు సూర్య కూడా పంజాబ్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల సూర్యకు కూతురు జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్య భాయ్ కుటుంబంతో ఉన్న సూరీడు.. ఇంకా జట్టులో చేరలేదని సమాచారం. కుటుంబ విషయాల్లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎప్పుడూ సానుకూలంగా వ్యవహరిస్తుందని, అందుకే అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశముందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు హార్దిక్ పాండ్యా కోసం ఇప్పటికే ధర్మశాల ప్రయాణ టికెట్లు బుక్ చేసినట్లు సమాచారం. మంగళవారం రాత్రి అతడు మూడు గంటల పాటు ఒంటరిగా ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ ప్రాక్టీస్ వీడియోలను కూడా హార్దిక్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయినప్పటికీ అతడు జట్టుతో చేరుతాడా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో హార్దిక్ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్ అవుతాడనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగింది.
అయితే అలాంటి అవకాశం ఏ మాత్రం లేదని నివేదికలు స్పష్టం చేశాయి. హార్దిక్, సూర్య ఇద్దరూ అందుబాటులో లేకపోతే.. జస్ప్రీత్ బుమ్రా లేదా తిలక్ వర్మలో ఒకరు తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరిని కెప్టెన్‌గా ఎంపిక చేస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను మాత్రం మళ్లీ తాత్కాలిక కెప్టెన్‌గా నియమించే అవకాశం లేదని సమాచారం.
ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కార్బిన్ బోష్ కూడా హార్దిక్ పాండ్యా గైర్హాజరీపై స్పందించాడు. ‘హార్దిక్ కేవలం కెప్టెన్ మాత్రమే కాదు.. అద్భుతమైన క్రికెటర్ కూడా. మైదానంలో అతని ప్రభావాన్ని మేము మిస్ అవుతున్నాం. కానీ ఆట ముందుకు సాగాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా మేము క్రికెట్ ఆడాల్సిందే’ అని చెప్పాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోయిన ముంబై.. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌ల్లో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తోంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఎవరు కెప్టెన్‌గా బరిలోకి దిగుతారన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.




