PBKS vs MI: ఇంట్రెస్ట్ లేకుంటే ఆడొద్దు.. అర్ష్‌దీప్ పై మాజీ ప్లేయర్ ఫైర్!

PBKS vs MI: వరుస ఓటములతో ఒత్తిడిలో పడిన పంజాబ్ కింగ్స్‌కు ఎస్ బద్రీనాథ్ కీలక సూచనలు చేశాడు.

Rishvik
Published on: 14 May 2026 8:42 PM IST
PBKS vs MI
X

PBKS vs MI: ఇంట్రెస్ట్ లేకుంటే ఆడొద్దు.. అర్ష్‌దీప్ పై మాజీ ప్లేయర్ ఫైర్!

PBKS vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్) 2026లో వరుస ఓటములతో ఒత్తిడిలో పడిన పంజాబ్ కింగ్స్‌కు మాజీ భారత క్రికెటర్, మాజీ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎస్. బద్రీనాథ్ కీలక సూచనలు చేశాడు. స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఫామ్‌పై స్పందిస్తూ.. అలసట కారణంగా ప్రదర్శన దెబ్బతింటే.. అసలు మ్యాచ్‌లు ఆడకూడదని స్పష్టం చేశాడు. ఒకసారి మైదానంలోకి దిగితే 100 శాతం ప్రదర్శన ఇవ్వాలన్నాడు. ఈరోజు ముంబై ఇండియన్స్‌, పంజాబ్ మధ్య జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు బద్రీనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఈ సీజన్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీశాడు. భారీగా రన్స్ ఇవ్వడమే కాకుండా.. ఎక్కువగా అదనపు పరుగులు కూడా ఇస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్.

ఆ టోర్నీలో 10 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం అతడి బౌలింగ్‌లో నిలకడ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎస్ బద్రీనాథ్.. ‘అలసట అనే కారణాన్ని నేను నమ్మను. అలసటగా ఉంటే ఆడొద్దు. కానీ ఒకసారి మైదానంలోకి దిగితే 100 శాతం ఇవ్వాలి. ఇదే అత్యున్నత స్థాయి ఆటగాడి స్వభావం’ అని కీలక వ్యాఖ్యలు చేశాడు.

అర్ష్‌దీప్ సింగ్ ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేయగా.. మరికొన్ని మ్యాచ్‌ల్లో పూర్తిగా తేలిపోయాడని ఎస్ బద్రీనాథ్ పేర్కొన్నాడు. ‘అర్ష్‌దీప్ రిథమ్ బౌలర్. బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. ఒకసారి పిచ్ నుంచి స్వింగ్ దొరికితే అతడు పూర్తిగా భిన్నమైన బౌలర్‌గా మారతాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ఫామ్ ఏమంత బాగా లేదు. ఇలాంటి సమయంలో పంజాబ్‌కు, అర్ష్‌దీప్‌కు ఇది గోల్డెన్ ఛాన్స్. పైగా ముంబైపై అతడి రికార్డు కూడా బాగానే ఉంది. అర్ష్‌దీప్ రాణిస్తాడు అని అనుకుంటున్నా’ అని బద్రీనాథ్ ధీమా వ్యక్తం చేశాడు .

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ పరిస్థితి ప్రస్తుతం అత్యంత క్లిష్టంగా మారింది. టోర్నీ తొలి భాగంలో అద్భుతంగా ఆడిన పంజాబ్.. ఇప్పుడు వరుసగా నాలుగు ఓటములతో ప్లేఆఫ్స్ రేసులో వెనుకబడింది. ఒక దశలో అపరాజిత జట్టుగా నిలిచిన శ్రేయస్ సేన.. ఇప్పుడు టాప్-4లో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో కనీసం రెండు విజయాలు సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలు పంజాబ్‌ను తీవ్రంగా నిరాశపరుస్తున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ చేసినప్పటికీ.. చివరి ఐదు ఓవర్లలో పేసర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేకపోయారు. శ్రేయస్ కూడా ఓటమికి బౌలింగ్ కారణమని అంగీకరించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో 10 జట్లలో అత్యధిక ఎకానమీ రేట్ ఉన్న పేస్ దాడి పంజాబ్ కింగ్స్‌దే కావడం ఆ జట్టు బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబైపై పంజాబ్ ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story