Nitish Kumar Reddy: అమ్మ ఫోన్ చేసింది.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి వీడియో వైరల్!

Nitish Kumar Reddy: ధర్మశాలలో వన్డే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నితీష్ రెడ్డికి ఫోన్‌కు కాల్ వచ్చింది.

Rishvik
Published on: 14 Jun 2026 6:15 PM IST
Nitish Kumar Reddy
X

Nitish Kumar Reddy: అమ్మ ఫోన్ చేసింది.. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి వీడియో వైరల్!

Nitish Kumar Reddy: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ సూపర్ విక్టరీ సాధించింది. అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్‌ దూబే చెరో మూడు వికెట్లు తీయగా.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌ రెడ్డి 2 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్‌ అనంతరం భారత యువ ఆల్‌రౌండర్ నితీశ్‌ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నితీశ్ రెడ్డిపై ఫాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.

ఐదు నిమిషాల్లో కాల్ చేస్తా అమ్మ:

ధర్మశాలలో వన్డే మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో నితీష్ రెడ్డికి ఫోన్‌కు కాల్ వచ్చింది. ఆ కాల్ చేసినది అతడి తల్లి కావడం విశేషం. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న నితీష్.. తన తల్లి నుంచి ఫోన్‌ రాగానే వెంటనే స్పందించాడు. ఒక్క నిమిషం మాట్లాడటం ఆపేసిన నితీశ్.. మీడియాకు సారీ చెప్పి తన తల్లి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ను లిఫ్ట్‌ చేశాడు.

'అమ్మా.. నేను ఐదు నిమిషాలు తర్వాత చేస్తా' అని చెప్పాడు. ఆపై ప్రెస్‌మీట్‌ను కొనసాగించిన నితీశ్.. మరోసారి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో వరుసగా మంచి ప్రదర్శనలు చేస్తూ గుర్తింపు పొందుతున్న నితీష్ తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఈ సంఘటన ద్వారా మరోసారి చాటుకున్నారు. నితీశ్ వినయం, కుటుంబ విలువలను అభిమానులు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

31 పరుగులు, రెండు వికెట్లు:

మైదానంలో తన ప్రతిభతో ఆకట్టుకున్న నితీశ్ కుమార్ రెడ్డి.. మ్యాచ్ అనంతరం తల్లి నుంచి వచ్చిన ఫోన్‌కు ఇచ్చిన గౌరవంతో మరింత మంది అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. భారత క్రికెట్‌కు మరో వినయశీల యువ స్టార్‌గా ఆయన ఎదుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో నితీశ్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అఫ్గానిస్థాన్ స్టార్ బ్యాటర్ రహ్మనుల్లా గుర్బాజ్‌, సీనియర్ ప్లేయర్ మహ్మద్ నబీలను అవుట్ చేశాడు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 ఇన్నింగ్స్‌లలో 302 రన్స్ చేశాడు. అలానే బౌలింగ్‌లో ఎనిమిది వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌గా తన సేవలు అందించాడు.

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం:

మ్యాచ్ విషయానికి వస్తే.. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆఫ్ఘనిస్థాన్‌పై ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఆఫ్ఘనిస్థాన్ తరఫున రహ్మానుల్లా గుర్బాజ్ అద్భుత సెంచరీ (102)తో జట్టుకు శుభారంభం అందించినప్పటికీ.. భారత బౌలర్లు మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. లక్ష్య ఛేదనలో భారత్‌కు రోహిత్ శర్మ (16), శుభ్‌మన్ గిల్ (84) మంచి ఆరంభం అందించారు. అనంతరం ఇషాన్ కిషన్ 22 బంతుల్లో 34 పరుగులతో మెరుపులు మెరిపించగా.. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో అజేయంగా 39 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story