Commonwealth Games 2026: జావెలిన్ త్రో ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. మరో ఇద్దరు భారత అథ్లెట్లు కూడా అర్హత!
Neeraj Chopra reaches the Commonwealth Games 2026 men's javelin final. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఫైనల్‌కు అర్హత సాధించాడు.
Commonwealth Games 2026: జావెలిన్ త్రో ఫైనల్‌కు నీరజ్ చోప్రా.. మరో ఇద్దరు భారత అథ్లెట్లు కూడా అర్హత!
Commonwealth Games 2026: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. పురుషుల జావెలిన్ త్రో అర్హత పోటీల్లో 79.61 మీటర్ల అత్యుత్తమ త్రో నమోదు చేసి.. మొత్తం 12 మంది ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకున్నాడు. క్వాలిఫయింగ్ రౌండ్లో 18 మంది పోటీపడగా.. భారత్ నుంచి పాల్గొన్న ముగ్గురు అథ్లెట్లు ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. నీరజ్ చోప్రా సహా రోహిత్ యాదవ్ (78.37 మీటర్లు), యశ్ వీర్ సింగ్ (78.36 మీటర్లు)లు శుక్రవారం రాత్రి 10.15 గంటలకు జరిగే ఫైనల్లో పాల్గొంటారు.
క్వాలిఫయింగ్ రౌండ్లో ఎవరూ 84.00 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్క్‌ను అందుకోలేకపోయారు. దాంతో ర్యాంకింగ్ ఆధారంగా అథ్లెట్లను ఫైనల్‌కు ఎంపిక చేశారు. మొత్తం ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా ఐదో స్థానంలో నిలిచాడు. గ్లాస్గోలో బలమైన గాలులతో కూడిన వాతావరణం అథ్లెట్లకు పెను సవాలుగా మారింది. అర్హత పోటీల్లో శ్రీలంకకు చెందిన రుమేశ్ పతిరాగే 82.84 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలవగా.. గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ 81.29 మీటర్లతో రెండో స్థానం దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా అథ్లెట్ డౌ స్మిట్ (80.64 మీటర్లు), ఇంగ్లండ్‌కు చెందిన బెన్ ఈస్ట్ (80.38 మీటర్లు) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచారు. నీరజ్ చోప్రా 79.61 మీటర్లతో ఐదో స్థానాన్ని సొంతం చేసుకోగా.. ఆస్ట్రేలియాకు చెందిన కామెరాన్ మెక్‌ఎంటైర్ (78.91 మీటర్లు), పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ (78.63 మీటర్లు) తర్వాత స్థానాల్లో నిలిచారు.
నీరజ్ చోప్రా తన తొలి ప్రయత్నంలో ఈటెను 76.28 మీటర్లు విసిరాడు. రెండో ప్రయత్నంలో 79.61 మీటర్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు. అప్పటికే ఫైనల్‌కు అర్హత ఖరారవడంతో మూడో ప్రయత్నం చేయకుండా విశ్రాంతి తీసుకున్నాడు. పతకాల కోసం జరిగే ఫైనల్ పోటీకి శక్తిని దాచుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు ఈ అర్హత రౌండ్ విజయవంతంగా ముగిసిందనే చెప్పాలి. నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశ్ వీర్ సింగ్ కూడా ఫైనల్‌కు అర్హత సాధించారు. రోహిత్ యాదవ్ 78.37 మీటర్ల త్రోతో తొమ్మిదో స్థానంలో నిలవగా.. యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్లతో పదో స్థానంలో నిలిచాడు. దీంతో భారత జట్టు నుంచి పాల్గొన్న ముగ్గురు జావెలిన్ త్రోయర్లు కూడా ఫైనల్లో పతకాల కోసం పోటీ పడనున్నారు.
అర్హత పోటీల్లో అతిపెద్ద సంచలనం కెన్యా స్టార్ జూలియస్ యేగో నిష్క్రమణ. 2015 ప్రపంచ ఛాంపియన్, రియో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన యేగో 74.50 మీటర్ల త్రోతో 13వ స్థానంలో నిలిచి ఫైనల్‌కు ఒక్క స్థానం తేడాతో దూరమయ్యాడు. అలాగే పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ యాసిర్ కూడా చివరి క్షణాల్లో టాప్-12 నుంచి తప్పుకోవడంతో.. ఫైనల్ అవకాశాన్ని కోల్పోయాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్‌పై నిలిచింది. నీరజ్ చోప్రా మరోసారి భారత్‌కు స్వర్ణ పతకం అందిస్తాడా?.. అండర్సన్ పీటర్స్, అర్షద్ నదీమ్ వంటి బలమైన ప్రత్యర్థులను అధిగమించి పోడియంపై నిలుస్తాడా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. భారత్ తరఫున ముగ్గురు అథ్లెట్లు ఫైనల్‌కు చేరడంతో కనీసం ఒక్క పతకం అయినా దక్కాలని భారతీయులు కోరుకుంటున్నారు.




