MS Dhoni: సీఎస్‌కే చివరి మ్యాచ్.. అహ్మదాబాద్‌కు కాదు రాంచీకి ఎంఎస్ ధోనీ.. ఇక ఆ రేర్ రికార్డు గల్లంతే!

MS Dhoni left for Ranchi. ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది.

Rishvik
Published on: 21 May 2026 6:00 PM IST
MS Dhoni
X

MS Dhoni: సీఎస్‌కే చివరి మ్యాచ్.. అహ్మదాబాద్‌కు కాదు రాంచీకి ఎంఎస్ ధోనీ.. ఇక ఆ రేర్ రికార్డు గల్లంతే!

MS Dhoni: ఐపీఎల్ 2026లో నేడు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడనుంది. గుజరాత్ టైటాన్స్‌ (జీటీ)తో ఇవాళ అహ్మదాబాద్‌ వేదికగా సీఎస్‌కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అయినా సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడతాడని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ధోని అహ్మదాబాద్‌కు కాకుండా.. తన స్వస్థలం రాంచీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ధోనీ ఇప్పటికే జట్టు హోటల్‌ను వీడి రాంచీ చేరుకున్నట్లు సమాచారం. సీఎస్‌కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే మాత్రమే ఆయన మళ్లీ జట్టుతో కలుస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే మహీ ఉన్నపళంగా ఎందుకు రాంచీ వెళ్లాడనేది మాత్రం కారణాలు తెలియరాలేదు.

ఎంఎస్ ధోనీ గత రెండు సీజన్లలో ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చి అభిమానులను అలరించాడు. ఐపీఎల్ 2026లో మాత్రం ఇప్పటివరకు ఆడలేదు. ఇప్పటికే సీఎస్‌కే 13 లీగ్‌ మ్యాచ్‌లు ఆడేసింది. ఈరోజు చివరి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో అహ్మదాబాలో ఆడనుంది. ధోనీ జట్టుతో పాటు అహ్మదాబాద్‌కు కాకుండా.. రాంచీ వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో సీఎస్‌కే ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ మొత్తంలో ధోనీ దాదాపు అన్ని అవే మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. లక్నోకు వెళ్లిన ఒక్క మ్యాచ్ మినహా.. ఆయన ఇతర బయటి మ్యాచ్‌లకు జట్టుతో పాటు ప్రయాణించలేదు. దీంతో అహ్మదాబాద్ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేకపోవడం పెద్ద ఆశ్చర్యంగా ఏమి లేదు.

సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ.. ఎంఎస్ ధోనీ గైర్హాజరుకు అసలు కారణాన్ని వెల్లడించాడు. ధోనీకి తాజాగా బొటన వేలికి గాయమైందని, అది తీవ్రమైన నొప్పిని కలిగిస్తోందని తెలిపాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో ధోనీ చేతికి భారీగా టేపింగ్ కనిపించడానికీ ఇదే కారణమని స్పష్టమైంది. ఈ ఐపీఎల్ సీజన్ ధోనీకి పూర్తిగా నిరాశాజనకంగానే మారింది. టోర్నీ ప్రారంభానికి ముందు కాల్వ్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. ఇప్పుడు బొటన వేలి గాయం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఫలితంగా ఐపీఎల్ 2026లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. హోం మ్యాచ్‌ల సమయంలో మాత్రం మహీ డగౌట్‌లో కనిపిస్తూ జట్టుకు మానసిక బలంగా నిలిచాడు. కానీ అభిమానులు మాత్రం మైదానంలో ధోనీని చూడకపోవడంతో నిరాశ చెందారు.

ఇటీవల చెపాక్‌లో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అనంతరం భావోద్వేగ వాతావరణం నెలకొంది. సీఎస్‌కే ఓటమి అనంతరం జట్టు సంప్రదాయంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు గ్రౌండ్ చుట్టూ తిరిగింది. గాయాలతో బాధపడుతున్నప్పటికీ ఎంఎస్ ధోనీ కూడా మైదానంలోకి వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. ఆ క్షణం చూసిన చాలా మందికి అది ధోనీ చివరి వీడ్కోలు అన్న భావన కలిగింది. కానీ మహీ తన వీడ్కోలు విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ధోనీ ఈ సీజన్‌లో ఆడకుంటే ఓ రేర్ రికార్డు మిస్ అవుతుంది. ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి నలుగురు ప్లేయర్లు మాత్రమే ఇంకా ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీశ్‌ పాండేలు ప్రతి సీజన్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌ అయినా ఆడారు. ఈ జాబితాలో మహీ చేరాలంటే.. ఐపీఎల్ 2026లో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story