MI vs SRH: టాస్ గెలిచిన ముంబై, అభిమానులకు నిరాశే.. తుది జట్లు ఇవే!

MI vs SRH: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది.

Rishvik
Published on: 29 April 2026 7:26 PM IST
MI vs SRH
X

MI vs SRH: టాస్ గెలిచిన ముంబై, అభిమానులకు నిరాశే.. తుది జట్లు ఇవే!

MI vs SRH: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా మరికొద్ది సేపట్లో మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. రెండు జట్లు కూడా మార్పులతో బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఆడుతాడని అనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. మరో రెండు ఈ మ్యాచ్‌లకు రోహి దూరం కానున్నట్లు ముంబై కెప్టెన్ చెప్పాడు.

టాస్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని తెలిపాడు. వాతావరణం చల్లగా ఉండటంతో పాటు గాలి కూడా వీస్తోందని, డ్యూ ప్రభావం పెద్దగా ఉండదని భావిస్తున్నట్లు చెప్పాడు. గత మ్యాచ్‌ల తర్వాత జట్టు రీసెట్ అయ్యిందని, ప్రాక్టీస్ సెషన్లలో మంచి ఫోకస్ పెట్టామని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ కోసం జట్టులో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించాడు. రికెల్టన్, మిన్జ్ జట్టులోకి వచ్చారని.. రోహిత్ శర్మ ఇంకా పూర్తి ఫిట్‌గా లేడని హార్దిక్ చెప్పాడు.

సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. తాము టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని అన్నాడు. పిచ్ కొంచెం స్లోగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశాడు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం సవాల్‌గా మారవచ్చని తెలిపాడు. జట్టులో ఒక మార్పు చేసినట్లు చెప్పాడు. హర్ష్ దూబే జట్టులోకి వచ్చాడని కమిన్స్ వెల్లడించాడు. ప్లే ఆఫ్స్ దిశగా రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకం. ముంబై ఇండియన్స్ తమ హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకోవాలని చూస్తుంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక విజయంతో పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. క్రికెట్ అభిమానులకు ఇది మరో హై వోల్టేజ్ థ్రిల్లర్‌గా మారే అవకాశాలు ఉన్నాయి.

వాంఖడే స్టేడియంలో సాధారణంగా హై స్కోరింగ్ మ్యాచ్‌లు జరుగుతుంటాయి. కానీ ఈసారి పిచ్ స్వభావం కొంచెం భిన్నంగా ఉండొచ్చని రెండు జట్ల కెప్టెన్లు అంటున్నారు. ముంబై ఇండియన్స్ తొలి బ్యాటింగ్‌తో పెద్ద స్కోర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. హైదరాబాద్ బౌలర్లు ప్రారంభం నుంచే ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయనున్నారు. ప్లే ఆఫ్స్ రేసులో కీలకంగా భావిస్తున్న ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తుది జట్లు:

ముంబై: ర్యాన్‌ రికెల్టన్‌ (వికెట్‌ కీపర్‌), విల్‌ జాక్స్‌, నమన్‌ ధీర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య (కెప్టెన్‌), రాబిన్‌ మిన్జ్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, జస్ప్రీత్ బుమ్రా, ఏఎమ్‌ ఘజన్‌ఫర్‌, అశ్వని కుమార్‌.

హైదరాబాద్: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, సలీల్‌ అరోరా (వికెట్‌ కీపర్‌), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), హర్ష్‌ దూబె, సకీబ్‌ హుస్సేన్‌, ప్రఫుల్‌ హింగే, ఎషాన్‌ మలింగ.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story