Kushal Bhurtel History: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. నేపాల్ ప్లేయర్ చరిత్ర.. టీ20ల్లో 221 పరుగుల భారీ తేడాతో విజయం!

Kushal Bhurtel Hits 6 Sixes in an Over. నేపాల్ ఓపెనర్ కుషాల్ భుర్టెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు.

Rishvik
Published on: 31 May 2026 7:16 PM IST
Kushal Bhurtel History
X

Kushal Bhurtel History: ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు.. నేపాల్ ప్లేయర్ చరిత్ర.. టీ20ల్లో 221 పరుగుల భారీ తేడాతో విజయం!

Kushal Bhurtel History: నేపాల్ ఓపెనర్ కుషాల్ భుర్టెల్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదాడు. దాంతో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన ఐదో టీ20 అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలిచాడు. ఆసియా గేమ్స్ 2026 పురుషుల టీ20 క్వాలిఫయర్‌లో సింగపూర్ నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో చైనాతో జరిగిన మ్యాచ్‌లో భుర్టెల్ ఆరు సిక్సర్లు కొట్టాడు. భారత మాజీ స్టార్ బ్యాటర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు అంటే కామన్ కాగా.. అప్పట్లో ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. ఆయా రోజుల్లోనే యువీ ఆరు సిక్సర్లు బాది క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

కుషాల్ భుర్టెల్ కేవలం 43 బంతుల్లోనే 129 పరుగులతో చెలరేగాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 16 భారీ సిక్సర్లు ఉన్నాయి. చైనా బౌలర్ చెన్ జువో యూయే వేసిన 9వ ఓవర్లో వరుసగా ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ ఓవర్లో మొత్తం 37 పరుగులు రాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది రెండో అత్యంత ఖరీదైన ఓవర్‌గా నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో వరుసగా ఆరు సిక్సర్లు బాదిన రెండో నేపాల్ బ్యాటర్‌గా కూడా భుర్టెల్ నిలిచాడు. అంతకుముందు దీపేంద్ర సింగ్ ఐరీ 2024లో ఖతార్‌పై ఈ ఘనత సాధించాడు. అలాగే పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో నేపాల్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా భుర్టెల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. అతను 99 సిక్సర్లతో ఎయిరీ (89) రికార్డును అధిగమించాడు.

కుషాల్ భుర్టెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో నేపాల్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది నేపాల్ టీ20 అంతర్జాతీయ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన చైనా.. కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. దాంతో నేపాల్ 221 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. నేపాల్ జట్టు ఓ అరుదైన రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు 300 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా నిలిచింది. 2023 ఆసియా గేమ్స్‌లో మంగోలియాపై 314/3 స్కోరు చేసిన నేపాల్.. ఇప్పుడు మరోసారి 300+ స్కోరు నమోదు చేసింది.

టీ20 అంతర్జాతీయ చరిత్రలో యువరాజ్ సింగ్, దీపేంద్ర సింగ్ ఐరీ, కిరణ్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు. దీపేంద్ర సింగ్ రెండుసార్లు బాదడం విశేషం. 2024లో ఖతార్ జట్టుపై,2023లో మంగోలియాపై కూడా కొట్టాడు. ఇక కుషాల్ భుర్టెల్ ఇన్నింగ్స్ ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అతని ఆరు సిక్సర్ల ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. భుర్టెల్ బాదిన ఆరు సిక్సర్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story