వికెట్ తీసిన ఆనందంలో హద్దు దాటిన సెలబ్రేషన్స్.. టీమిండియా ప్లేయర్‌కు షాకిచ్చిన ఐసీసీ..!
Kranti Gaud ICC Punishment: మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి టైటిల్ అందుకున్న భారత జట్టుకు మరో వార్త ఎదురైంది.
వికెట్ తీసిన ఆనందంలో హద్దు దాటిన సెలబ్రేషన్స్.. టీమిండియా ప్లేయర్‌కు షాకిచ్చిన ఐసీసీ..!
Kranti Gaud ICC Punishment: భారత మహిళల క్రికెట్ జట్టు పేసర్ క్రాంతి గౌడ్ (Kranti Gaud)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) శిక్ష విధించింది. మహిళల ఆసియా కప్ (Women's Asia Cup) ఫైనల్లో శ్రీలంక ఓపెనర్ ఇమేషా దులానీని ఔట్ చేసిన సమయంలో క్రాంతి చేసిన సంజ్ఞ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ఐసీసీ తేల్చింది. దీంతో ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. అలాగే ఒక డీమెరిట్ పాయింట్ కూడా జత చేశారు. 24 నెలల వ్యవధిలో ఇది ఆమెకు తొలి తప్పిదంగా ఐసీసీ పేర్కొంది. ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఆసియా కప్ టైటిల్‌ను ఎనిమిదోసారి గెలుచుకున్న మరుసటి రోజే ఈ చర్య వెలువడింది.
ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో దులానీ వికెట్ పడగొట్టిన తరువాత క్రాంతి గౌడ్ పెవిలియన్ వైపు చూపిస్తూ సంజ్ఞ చేసింది. ఈ చర్యను ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.5 పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రత్యర్థి బ్యాటర్ ఔటైన సందర్భంలో ఆమెను అవమానించేలా లేదా దూకుడైన ప్రతిస్పందనకు ప్రేరేపించేలా భాష, చర్యలు, సంజ్ఞలు చేయకూడదన్నది ఈ నిబంధన ఉద్దేశం.
మ్యాచ్‌లో విధులు నిర్వహించిన అంపైర్లు సలీమా ఇంతియాజ్, శతీరా జకీర్ జెసీ, మూడో అంపైర్ రోకేయా సుల్తానా, నాలుగో అంపైర్ హుమైరా ఫరా కలిసి ఈ అభియోగాన్ని నమోదు చేశారు. మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణి దాస్ ప్రతిపాదించిన శిక్షను క్రాంతి అంగీకరించింది. దీంతో అధికారిక విచారణ లేదా తదుపరి చర్య అవసరం లేకుండానే కేసు ముగిసింది.
లెవల్-1 ఉల్లంఘనలకు కనీసంగా అధికారిక మందలింపు ఉంటుంది. గరిష్ఠంగా మ్యాచ్ ఫీజులో 50 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు కూడా ఇవ్వవచ్చు. క్రాంతికి ఈ ఘటనలో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
ఇదే సమయంలో శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్లో స్లో ఓవర్‌రేట్ కారణంగా పాకిస్థాన్ మహిళల జట్టుపైనా ఐసీసీ చర్య తీసుకుంది. నిర్ణీత సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిన కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐదు శాతం చొప్పున కోత పడింది. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఆ శిక్షను అంగీకరించింది.




