Virat Kohli: 18 ఏళ్ల పాటు నీతో ఉన్నా.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్‌సీబీ స్టార్!
Virat Kohli: 2008 నుంచి 2025 వరకు 18 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు హెడ్ ఫిజియోగా ఇవాన్ స్పీచ్లీ సేవలందించారు.
Virat Kohli: 18 ఏళ్ల పాటు నీతో ఉన్నా.. కన్నీళ్లు పెట్టుకున్న ఆర్‌సీబీ స్టార్!
Virat Kohli: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ 'ఇవాన్ స్పీచ్లీ'. 2008 నుంచి 2025 వరకు 18 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు హెడ్ ఫిజియోగా సేవలందించారు. భారత క్రికెట్ జట్టుకు కూడా ఫిజియోగా (2011-2013) ఆయన పనిచేశారు. ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో స్పీచ్లీకి బలమైన అనుబంధం ఉంది. సంవత్సరాల పాటు ఆర్‌సీబీతో కొనసాగిన స్పీచ్లీసేవలు ముగియడంతో ఆర్‌సీబీ కుటుంబంలో ఒక యుగానికి తెరపడింది. ఈ సందర్భంగా బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో బెంగళూరు ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ కలిసి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఇవాన్ స్పీచ్లీ వీడ్కోలు కార్యక్రమంలో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తన భావోద్వేగం చెందాడు. 'ఆర్‌సీబీలో నేను ఎక్కువ సమయం గడిపింది మీతోనే. మీరు జట్టుకు ఓ అసలైన ‘ఓజీ’. మీరు జట్టు కోసం కష్టపడి పనిచేశారు. వర్క్ మాత్రమే కాదు మీ మానవత్వం, పరామర్శ, నిజాయితీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీరు ఈ కుటుంబంలో ఎప్పటికీ భాగమే' అని కోహ్లీ పేర్కొన్నాడు. కింగ్ మాటలు అక్కడ ఉన్న అందరినీ కదిలించాయి. ఆర్‌సీబీ ప్లేయర్స్ అందరూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఆర్‌సీబీ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మో బోబాట్ మాట్లాడుతూ ఇవాన్ స్పీచ్లీ సేవలను ప్రశంసించాడు. 'ఎవాన్ ఎంతో కాలం మా జట్టుకు ప్రధాన ఫిజియోగా పనిచేశాడు. అతని సేవల గుర్తుగా అతనితో సమయం గడిపేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అతను ఆర్‌సీబీకి చేసిన సేవలు అమూల్యమైనవి' అని తెలిపారు. ఈ సత్కారానికి స్పందించిన ఎవాన్ స్పీచ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. 'నిన్న హోటల్‌లోకి అడుగుపెట్టినప్పుడు నాకు ఇంటికి వచ్చినట్టే అనిపించింది. ఆర్‌సీబీతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మరిచిపోలేను. ప్రపంచంలో ప్రతి క్రికెటర్ కనీసం ఒక సీజన్ అయినా ఆర్‌సీబీతో గడపాలని కోరుకుంటాడు. నేను 18 సంవత్సరాలు గడపడం నా అదృష్టం' అని చెప్పాడు.
సుమారు రెండు దశాబ్దాల పాటు వివిధ తరాల ఆటగాళ్లతో కలిసి ఇవాన్ స్పీచ్లీ పని చేశారు. జట్టులో అత్యంత నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని సేవలు కేవలం గాయాల నివారణకే కాకుండా.. ఆటగాళ్ల ఫిట్‌నెస్, మానసిక బలానికి కూడా కీలకంగా మారాయి. ఈ వీడ్కోలు కార్యక్రమం ద్వారా ఆర్‌సీబీ వెనుక ఉన్న సైలెంట్ హీరోలను కూడా గుర్తు చేసింది. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన చేస్తోంది. వరుస విజయలతో ప్లేఆఫ్స్ దిశగా దూసుకుపోతోంది. మరో రెండు విజయాలు అందుకుంటే.. ప్లేఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.




