KKR vs SRH: అభిషేక్, హెడ్, క్లాసెన్ మెరుపులు.. కోల్‌కతా ముందు భారీ టార్గెట్, సన్‌రైజర్స్ బౌలర్లు ఏం చేస్తారో!
KKR vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ముగిసింది. ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. కోల్‌కతా టార్గెట్ 227 పరుగులుగా ఉంది.
KKR vs SRH IPL 2026
KKR vs SRH IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) బ్యాటింగ్ ముగిసింది. ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 రన్స్ చేసింది. కోల్‌కతా టార్గెట్ 227 పరుగులుగా ఉంది. ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ (48; 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), ట్రావిస్ హెడ్ (46; 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు), హెన్రిచ్ క్లాసెన్ (52; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సు) మెరుపులు మెరిపించారు. తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 రన్స్ చేశాడు. కేకేఆర్ బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్స్ పడగొట్టాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఎస్ఆర్హెచ్కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడారు. గత మ్యాచ్‌లో విఫలమైన ఈ జోడి కోల్‌కతాపై విరుచుకుపడింది. ఇద్దరు బౌండరీలు, సిక్సులు బాదడంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ పరుగులు పెట్టింది. 5 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 71/0గా నిలిచింది. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో (5.4) కామెరూన్ గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి హెడ్ అవుట్ అయ్యాడు. వరుసగా మూడు ఫోర్లు బాదిన ఇషాన్ కిషన్ (14) ముజరబానీ బౌలింగ్‌లో (8.2) రింకు సింగ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో (8.4) అభిషేక్ శర్మ పెవిలియన్ చేర్చాడు.
గత మ్యాచ్‌లో మెరిసిన అనికేత్ వర్మ (1) నిరాశపరిచాడు. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి జట్టును ఆదుకున్నారు. ఇద్దరు నిలకడగా ఆడుతూ 34 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో 15 ఓవర్లకు హైదరాబాద్ స్కోర్ 168/4గా నిలిచింది. 18వ ఓవర్లో స్కోర్ 200 దాటింది. వైభవ్ అరోరా బౌలింగ్‌లో (18.1) వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి నితీశ్ పెవిలియన్ చేరాడు. తర్వాతి బంతికే సలీల్ అరోరా (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్లాసెన్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి మరో ఉండగా అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ చివరకు 226/8 స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ బలహీనంగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఏం చేస్తారో చూడాలి.




