KKR vs LSG: కోల్‌కతాను ఆదుకున్న రూ.25 కోట్ల ఆటగాడు.. లక్నో ముందు భారీ టార్గెట్!

KKR posted 181/4 against LSG. ఐపీఎల్‌ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, లక్నో మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ ముగియగా.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

Rishvik
Published on: 9 April 2026 11:50 PM IST
KKR vs LSG IPL 2026: Cameron Green, Rovman Powell Power Kolkata to 181
X

KKR vs LSG IPL 2026

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ ముగియగా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దాంతో లక్నోకు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బ్యాటర్ల సమిష్టి ప్రదర్శనతో కేకేఆర్ పోరాడే స్కోర్ చేసింది. 111 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ పడగా.. కోల్‌కతాను రూ.25 కోట్ల ఆటగాడు కామెరూన్‌ గ్రీన్ (32), విండీస్ ఆటగాడు రోవ్‌మన్‌ పావెల్‌ (39) ఆదుకున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై 181 పరుగులు మంచి స్కోర్‌గా చెప్పొచ్చు. ఈ లక్ష్యాన్ని లక్నో ఎలా ఛేదిస్తుందో చూడాలి.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ ఫిన్ అలెన్ (9) ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే దూకుడుగా ఆడాడు. 24 బంతుల్లో 41 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించాడు. యువ బ్యాటర్ అంగ్ర్కిష్ రఘువంశీ 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. రహానే, రఘువంశీ కలిసి కోల్‌కతా స్కోరును 100 దాటించారు. 11వ ఓవర్లో దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ బౌలింగ్‌లో రహానే పెవిలియన్ చేరగా.. 12వ ఓవర్లో రఘువంశీ కూడా అవుట్ అయ్యాడు.

14వ ఓవర్లో రింకు సింగ్‌ (4) బౌల్డ్‌ అవవడంతో కోల్‌కతా కష్టాల్లో పడింది. ఈ సమయంలో కామెరూన్ గ్రీన్ నిలకడగా ఆడాడు. 24 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రోవ్‌మన్ పావెల్ దూకుడుగా ఆడుతూ 24 బంతుల్లో 39 పరుగులు చేసి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు మరో వికెట్స్ పడకుండా వేగంగా ఆడడంతో కోల్‌కతా 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ, మనిమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. మహమ్మద్ షమీ మాత్రం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో 27 పరుగులే ఇచ్చాడు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story