అంత బాధ ఎందుకు?.. పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి.. రోహిత్ రిటైర్మెంట్‌పై క్రికెట్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!

Kapil Dev reacts to Rohit Sharma's retirement rumours. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

Rishvik
Published on: 18 July 2026 7:36 PM IST
Kapil Dev reacts to Rohit Sharma
X

అంత బాధ ఎందుకు?.. పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి.. రోహిత్ రిటైర్మెంట్‌పై క్రికెట్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!

Kapil Dev reacts to Rohit Sharma's retirement rumours: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆదివారం ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే హిట్‌మ్యాన్ చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రిటైర్ అయినా బాధపడాల్సిన అవసరం లేదని, అతడు భారత క్రికెట్‌కు అందించిన సేవలను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని అభిమానులకు సూచించారు.

బాధపడాల్సిన అవసరం ఏముంది?:

సునీల్ గుప్తా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రోహిత్ శర్మ చివరి వన్డే గురించి ప్రశ్నించగా.. 'అందులో పెద్దగా బాధపడాల్సిన అవసరం ఏముంది?. రోహిత్ శర్మ ఎన్నో సంవత్సరాలుగా మనందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు. ప్రతి ప్లేయర్ ఏదో ఒక రోజు ఆటకు వీడ్కోలు చెప్పాల్సిందే కదా. మైదానం విడిచి సునీల్ గవాస్కర్ వెళ్లారు, రాహుల్ ద్రవిడ్ వెళ్లారు, అనిల్ కుంబ్లే వెళ్లారు, సౌరవ్ గంగూలీ వీడ్కోలు చెప్పాడు, సచిన్ టెండూల్కర్ కూడా రిటైర్ అయ్యారు. అదే విధంగా రోహిత్ కూడా ఒక రోజు తప్పకుండా మైదానం విడిచి వెళ్లాల్సి ఉంటుంది' అని పేర్కొన్నాడు.

సెంచరీ చేసి వీడ్కోలు చెప్పాలి:

రోహిత్ శర్మ సాధించిన విజయాలు, అభిమానులకు అందించిన వినోదాన్ని గుర్తు చేసుకుంటూ అతడి కెరీర్‌ను గౌరవించాలని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. 'రోహిత్ రిటైర్మెంట్‌ ఇచ్చిన రోజు అతడి జీవితాన్ని, కెరీర్‌ను సెలబ్రేట్ చేయాలి. హిట్‌మ్యాన్ దేశానికే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులకు ఎన్నో మధుర క్షణాలు అందించాడు. కాబట్టి బాధపడకుండా రోప్ట్ ప్రయాణాన్ని గర్వంగా గుర్తు చేసుకోవాలి' అని చెప్పాడు. ఒకవేళ నిజంగానే రిటైర్మెంట్ ప్రకటించే సమయం వస్తే శతకంతో రోహిత్ తన కెరీర్‌కు ముగింపు పలకాలని ఆకాంక్షించాడు. 'ఎప్పుడో ఒకరోజు అతడు రిటైర్ అవ్వాల్సిందే. కానీ ఆ రోజు వస్తే సెంచరీ చేసి ఘనంగా వీడ్కోలు చెప్పాలని కోరుకుంటున్నాను' అని వ్యాఖ్యానించాడు.

టీ20, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు:

ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు, టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న హిట్‌మ్యాన్.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 11, 26 పరుగులే చేశాడు. దాంతో అతడి ఫామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బీసీసీఐ ఇప్పటికే లార్డ్స్ వన్డే అతడి చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేసింది. అయినప్పటికీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు కొనసాగుతుండగా.. కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story