Kane Williamson: కోహ్లీనే కాదు.. విలియమ్సన్ కెరీర్‌లోనూ అది వెలితిగానే!

Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ప్రపంచ క్రికెట్‌లో ఓ యుగానికి తెరపడింది.

Rishvik
Published on: 13 Jun 2026 5:33 PM IST
Kane Williamson
X

Kane Williamson: కోహ్లీనే కాదు.. విలియమ్సన్ కెరీర్‌లోనూ అది వెలితిగానే!

Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో ప్రపంచ క్రికెట్‌లో ఓ యుగానికి తెరపడింది. 35 ఏళ్ల విలియమ్సన్ ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ మధ్యలోనే తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే గత ఏడాది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన కేన్.. ఇప్పుడు టెస్టులు, వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పి తన 16 ఏళ్ల అంతర్జాతీయ ప్రయాణాన్ని ముగించాడు.

మూడు ఫార్మాట్లలో 19 వేల రన్స్:

2010లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కేన్ విలియమ్సన్.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్‌లో 110 టెస్టులు, 175 వన్డేలు, 93 టీ20 మ్యాచ్‌లు ఆడిన కేన్ మామ.. అన్ని ఫార్మాట్లలో కలిపి 19 వేలకు పైగా పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలు, ఆరు డబుల్ సెంచరీలు ఉండటం అతని స్థిరత్వానికి నిదర్శనం. 2016 నుంచి 2024 వరకు దాదాపు ఎనిమిదేళ్ల పాటు న్యూజిలాండ్ జట్టుకు నాయకత్వం వహించి.. జట్టును ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానానికి చేర్చాడు.

కేన్ కెరీర్‌లో అదే వెలితి:

కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ సాధించిన విజయాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతని నాయకత్వంలో న్యూజిలాండ్ రెండు సార్లు ఐసీసీ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తొలి ఎడిషన్ టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది. ప్రశాంత స్వభావం, వ్యూహాత్మక ఆలోచనలు, అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కేన్ మామ సంపాదించుకున్నాడు.

అయితే అతని గొప్ప కెరీర్‌లో ఒక వెలితి మాత్రం అలాగే మిగిలిపోయింది. టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉండగానే అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. విలియమ్సన్ 110 టెస్టుల్లో 9,515 పరుగులు చేసి ఆటకు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేయడం అనేది అత్యంత అరుదైన ఘనత. ఇప్పటివరకు ప్రపంచ క్రికెట్‌లో కేవలం 15 మంది మాత్రమే ఈ మైలురాయిని అందుకున్నారు.

కోహ్లీ కూడా ఆ ఘనత అందుకోలేదు:

ఆసక్తికర విషయం ఏమిటంటే.. భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఘనత అందుకోలేదు. టెస్టు క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన కోహ్లీ.. 123 టెస్టుల్లో 9,230 పరుగులు మాత్రమే చేసి 10 వేల మార్క్‌కు చేరుకోలేకపోయాడు. ఫిట్‌నెస్ పరంగా చూస్తే కేన్ విలియమ్సన్, కోహ్లీ ఇద్దరికీ ఇంకా కొన్ని సంవత్సరాలు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది. అయినా కూడా ఇద్దరూ ఈ అరుదైన మైలురాయికి దూరంగానే తమ కెరీర్‌కు ముగింపు పలకడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

అయినప్పటికీ గణాంకాల కంటే వారు ఆటపై చూపిన ప్రభావమే గొప్పదని చెప్పాలి. కేన్ న్యూజిలాండ్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలబెట్టగా.. కోహ్లీ భారత టెస్టు జట్టును ప్రపంచ నంబర్-1 స్థానానికి చేర్చాడు. ఇద్దరూ తమ తమ దేశాల క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే లెజెండ్స్‌గా గుర్తుండిపోతారు. కోహ్లీ, కేన్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అండర్ -19 సమయంలో ప్రత్యర్థులుగా పోటీపడ్డ ఈ ఇద్దరు.. బయట మంచి స్నేహితులు.

Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story