SRH vs RCB : హైదరాబాద్ చేతిలో బెంగళూరు పరాజయం.. గెలిచిన సన్‌రైజర్స్ మూడో ప్లేస్, ఓడిన బెంగళూరు ఫస్ట్ ప్లేస్
SRH vs RCB : ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్ 55 పరుగులతో గెలిచినా మూడో స్థానానికే పరిమితమైంది. ఓడినప్పటికీ మెరుగైన రన్ రేట్‌తో ఆర్సీబీ టేబుల్ టాపర్‌గా నిలిచింది.
SRH vs RCB
SRH vs RCB : ఐపీఎల్ 2026 లీగ్ దశ చివరి అంకానికి చేరుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన 67వ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించగా, ఛేదనలో బెంగళూరు జట్టు 200 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ భారీ విజయం సాధించినప్పటికీ పాయింట్ల పట్టికలో ఆ జట్టుకు ఎలాంటి లాభం చేకూరలేదు. మరోవైపు ఓడిపోయినప్పటికీ బెంగళూరు జట్టు అగ్రస్థానంలోనే కొనసాగుతూ ప్లేఆఫ్స్ సమీకరణాల్లో లాభపడింది.
హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే శివతాండవం చేశారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (26), అభిషేక్ శర్మ కేవలం 4 ఓవర్లలోనే 45 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించారు. హెడ్ అవుట్ అయిన తర్వాత అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకుని.. మొత్తంగా 22 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత ఈషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ జోడి ఆర్సీబీ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. క్లాసెన్ 24 బంతుల్లో 51 పరుగులు చేయగా, ఈషాన్ కిషన్ 79 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆఖర్లో నితీష్ కుమార్ రెడ్డి కేవలం 12 బంతుల్లోనే 29 పరుగులు చేయడంతో హైదరాబాద్ 255 భారీ స్కోరును బోర్డుపై ఉంచింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 44 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ, అతడిని ఇషాన్ మలింగ అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ 56 పరుగులు చేసినప్పటికీ, అతడి ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా సాగింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులకే సాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడం ఆర్సీబీని కోలుకోలేని దెబ్బ తీసింది. దేవదత్ పడిక్కల్ (21) కూడా నిరాశపరిచాడు. ఆఖర్లో కృనాల్ పాండ్యా 41 పరుగులు, టిమ్ డేవిడ్ 15 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినప్పటికీ.. బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ మ్యాచ్‌లో 55 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చిన నష్టమేమీ లేదు. లీగ్ దశ ముగిసే సమయానికి బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ మూడు జట్లు కూడా చెరో 18 పాయింట్లతో (14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు) సమంగా నిలిచాయి. అయితే రన్ రేట్ పరంగా బెంగళూరు జట్టు (+1.065) అందరికంటే మెరుగ్గా ఉండటంతో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లోనే నిలిచింది. దీనివల్ల ఆర్సీబీకి ఫైనల్ చేరడానికి రెండు అవకాశాలు (క్వాలిఫైయర్ 1) లభిస్తాయి. మే 24న జరగబోయే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మ్యాచ్‌లో భారీ విజయం సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ శాపంగా మారింది. హైదరాబాద్ రన్ రేట్ (+0.350) గుజరాత్ (+0.695) కంటే తక్కువగా ఉండటంతో కమిన్స్ సేన మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. అంటే హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరాలంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే, ప్లేఆఫ్స్‌లో నాల్గో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. రాజస్థాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతే మాత్రం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు లక్కీ ఛాన్స్ దక్కుతుంది.




