IPL 2026 : ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్‌ను చితక్కొట్టిన హైదరాబాద్.. ఆరెంజ్ ఆర్మీ ఖాతాలో తొలి గెలుపు

IPL 2026 : ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయం సాధించింది. కోల్‌కతాపై 65 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో తొలి పాయింట్లు నమోదు చేసింది. అభిషేక్, క్లాసెన్ బ్యాటింగ్ తో చెలరేగగా, బౌలర్లు కేకేఆర్‌ను కట్టడి చేశారు.

CR Reddy
Published on: 3 April 2026 6:21 AM IST
IPL 2026
X

IPL 2026

IPL 2026 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కోల్‌కతా బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తొలి ఓవర్ నుంచే బాదుడు మొదలుపెట్టారు. అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 48 పరుగులు చేయగా, హెడ్ 21 బంతుల్లో 46 రన్స్ చేశాడు. వీరిద్దరూ కలిసి కేవలం 34 బంతుల్లోనే 82 పరుగుల మెరుపు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమ్‌కు సాలిడ్ ఫౌండేషన్ ఇచ్చారు.

క్లాసెన్, నితీష్ ఫినిషింగ్ టచ్

ఓపెనర్లు ఇచ్చిన ఊపును మిడిల్ ఆర్డర్ కూడా కొనసాగించింది. విధ్వంసకర బ్యాటర్ హెన్రిక్ క్లాసెన్ తనదైన శైలిలో 52 పరుగులతో హాఫ్ సెంచరీ బాదాడు. యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా 39 పరుగులతో మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. కేకేఆర్ బౌలర్లలో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ముక్కలైన కోల్‌కతా ఆశలు

227 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆరంభం బాగానే ఉన్నా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం ఆ జట్టును దెబ్బతీసింది. ఫిన్ అలెన్ కేవలం 7 బంతుల్లోనే 28 పరుగులు చేసి ఆశలు రేకెత్తించినా, ఆ జోరును ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. ఆంగ్ క్రిష్ రఘువంశీ (52) హాఫ్ సెంచరీ చేసినా దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. ఇక ఫినిషర్ రింకూ సింగ్ (35) ఈసారి అద్భుతం చేయలేకపోవడంతో కేకేఆర్ ఇన్నింగ్స్ 161 పరుగులకే ముగిసింది.

బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ మెరుపులు

బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్ ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ 3 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి కేకేఆర్ వెన్ను విరిచాడు. ఎహసాన్ మలింగ, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీయగా, హర్ష్ దూబే ఒక వికెట్ సాధించాడు. ఫలితంగా సన్‌రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. కేకేఆర్‌కు ఇది వరుసగా రెండో ఓటమి.

CR Reddy

CR Reddy

Next Story