MI vs CSK : వాంఖడేలో సీఎస్కే తాండవం.. 103 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం
MI vs CSK : ఐపీఎల్ 2026 లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల తేడాతో భారీ విజయం. సంజూ శాంసన్ అజేయ సెంచరీ, అకీల్ హొస్సేన్ 4 వికెట్లతో చెలరేగారు.
MI vs CSK
MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో అసలైన బాస్ ఎవరో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి నిరూపించింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఎల్-క్లాసికో పోరు ఏకపక్షంగా సాగింది. వాంఖడే స్టేడియంలో ముంబైని వారి సొంత అభిమానుల ముందే చెన్నై చిత్తుచిత్తుగా ఓడించింది. సంజూ శాంసన్ బ్యాట్‌తో విశ్వరూపం చూపిస్తే, అకీల్ హొస్సేన్ తన స్పిన్ మాయాజాలంతో ముంబై పని పట్టాడు. ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో గెలిచిన సీఎస్కే, ఈ సీజన్‌లో తమ మూడో విజయాన్ని ఘనంగా నమోదు చేసుకుంది.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ నిర్ణయం ఎంత తప్పో సంజూ శాంసన్ తన బ్యాటింగ్‌తో నిరూపించాడు. ఓపెనర్‌గా వచ్చిన సంజూ మొదటి ఓవర్ నుంచే ముంబై బౌలర్లపై దాడి మొదలుపెట్టాడు. కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా 101 పరుగులు సాధించాడు. సంజూకు తోడుగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22), డెవాల్డ్ బ్రెవిస్ (21) కూడా మెరుపులు మెరిపించడంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగుల కొండంత స్కోరును బోర్డుపై పెట్టింది.
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. అకీల్ హొస్సేన్ వేసిన స్పిన్ ఉచ్చులో ముంబై టాప్ ఆర్డర్ విలవిలలాడింది. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 3 వికెట్లు కోల్పోయి కేవలం 29 పరుగులే చేసింది. తిలక్ వర్మ (37), సూర్యకుమార్ యాదవ్ (35) కాసేపు పోరాడినా, రన్ రేట్ ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు. అకీల్ హొస్సేన్ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ముంబై వెన్ను విరిచాడు.
అకీల్ హొస్సేన్‌కు తోడుగా నూర్ అహ్మద్ తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ఒకే ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (1), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (0)లను వెనక్కి పంపి ముంబై ఆశలను పూర్తిగా ఆవిరి చేశాడు. ముంబై బ్యాటర్లలో ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడం విశేషం. ముఖేష్ చౌదరి, అన్షుల్ కంబోజ్, జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్ సింగ్ తలో వికెట్ తీసి ముంబై ఇన్నింగ్స్‌ను 19 ఓవర్లలోనే 104 పరుగులకు ముగించేశారు.
వాంఖడే స్టేడియంలో ముంబై కంటే పసుపు చొక్కాల అభిమానుల సందడి ఎక్కువగా కనిపించింది. రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ మైదానంలో లేకపోయినా, సంజూ శాంసన్ తన క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆ లోటును భర్తీ చేశాడు. ఈ 103 పరుగుల విజయం చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్ రేట్‌ను అమాంతం పెంచేసింది. మరోవైపు, సొంత గడ్డపై దారుణంగా ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టులో కెప్టెన్సీ మార్పు, ప్లేయర్స్ ఫామ్ పై చర్చ మొదలైంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది ముంబైకి ఎదురైన అత్యంత ఘోరమైన పరాజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.




