IPL 2026 : ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం.. కేవలం 39 బంతుల్లోనే మ్యాచ్ ఖతం
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఆర్సీబీ సంచలనం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కేవలం 75 పరుగులకు కట్టడి చేసి, 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి రికార్డు విజయాన్ని అందుకుంది.
RCB
IPL 2026 : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విశ్వరూపం చూపించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ బెంబేలెత్తించింది. బౌలింగ్‌లో నిప్పులు చెరిగిన బెంగళూరు బౌలర్లు, ఆపై బ్యాటింగ్‌లో సునామీ సృష్టించారు. కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి, ఐపీఎల్ చరిత్రలో తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా, ఢిల్లీకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఘోర పరాజయాన్ని మిగిల్చారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆ నిర్ణయం ఎంత సరైనదో తొలి ఓవర్ రెండో బంతికే అర్థమైపోయింది. అరంగేట్రం చేసిన సాహిల్ పరాఖ్‌ను భువనేశ్వర్ కుమార్ ఒక అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మొదలైన వికెట్ల పతనం ఆగలేదు. జోష్ హెజల్‌వుడ్ తన స్పెల్‌తో ఢిల్లీ టాప్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు. కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీ వంటి స్టార్ బ్యాటర్లు ఒకే ఓవర్లో పెవిలియన్ చేరారు. కేవలం 8 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఢిల్లీని చూసి ఫ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (18) కొంచెం పోరాడటంతో ఢిల్లీ స్కోరు 75కు చేరుకుంది. హెజల్‌వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ 3 వికెట్లతో చెలరేగిపోయారు.
76 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు ఆకలిగొన్న పులుల్లా విరుచుకుపడ్డారు. మ్యాచ్ గెలవడానికి వారు తీసుకున్న సమయం కేవలం 6.3 ఓవర్లు (39 బంతులు). ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఆర్సీబీకి ఇది అతిపెద్ద విజయం. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఊదిపడేశారు. ఒకవైపు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుండగా, ఢిల్లీ బౌలర్లు కనీసం ప్రతిఘటించలేకపోయారు. ముంబై ఇండియన్స్ గతంలో కేకేఆర్ పై 5.3 ఓవర్లలోనే ఛేదించిన రికార్డు తృటిలో తప్పిపోయినా, ఆర్సీబీ ఆడిన తీరు మాత్రం హైలైట్ గా నిలిచింది.
ఈ భారీ విజయంతో ఆర్సీబీ నెట్ రన్ రేట్ అమాంతం పెరిగింది. ఆడిన 8 మ్యాచ్‌లలో 6 విజయాలతో బెంగళూరు ఇప్పుడు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం విశేషం (కేకేఆర్ తో మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది). ఢిల్లీకి మాత్రం ఈ ఓటమి పెద్ద మచ్చగా మిగిలిపోవడమే కాకుండా, ప్లే ఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసింది.




