Mukul Chaudhary Record: 13 ఏళ్ల ఐపీఎల్‌ హిస్టరీకే ఇచ్చిపడేసిన 20 ఏళ్ల కుర్రాడు.. డెత్ ఓవర్లలో డెడ్లీ గేమ్ తో అరుదైన రికార్డ్..!

Mukul Chaudhary Record: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ 20 ఏళ్ల కుర్రాడి గురించే మాట్లాడుతున్నారు. డేంజరస్ ఇన్నింగ్స్ తో కేకేఆర్ ను కన్నీళ్లు పెట్టించిన ఈ యంగ్ ప్లేయర్ హాట్ టాపిక్ గా మారాడు.

Venkat
Published on: 10 April 2026 12:09 PM IST
Mukul Chaudhary Record
X

Mukul Chaudhary Record

Mukul Chaudhary Record: ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. యువ ఆటగాడు ముకుల్ చౌదరి విధ్వంసకర బ్యాటింగ్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ నోటి దగ్గరకు వచ్చిన విజయాన్ని దూరం చేశాడు. ఈ క్రమంలో ముకుల్ 13 ఏళ్ల నాటి ఒక అరుదైన రికార్డును సమం చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ టోర్నీలో తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. మూడు వికెట్ల తేడాతో కోల్‌కతాను ఓడించిన లక్నో, ప్రస్తుతం 4 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు, వరుస ఓటములతో సతమతమవుతున్న కోల్‌కతా తొమ్మిదో స్థానానికి పడిపోయింది. పంజాబ్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం కావడంతో ఇప్పటికే పాయింట్లను కోల్పోయిన కోల్‌కతాకు ఈ ఓటమి కోలుకోలేని దెబ్బగా మారింది.

కోల్‌కతా బ్యాటింగ్: రహానే, రఘువంశీ మెరుపులు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫిన్ అలెన్ త్వరగానే పెవిలియన్ చేరినప్పటికీ, అజింక్య రహానే (41), అంగక్రిష్ రఘువంశీ (45) రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో రోవ్‌మన్ పావెల్, కామెరాన్ గ్రీన్ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది.

ముకుల్ చౌదరి ఇన్నింగ్స్ తో చారిత్రక రికార్డ్..

182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభం అంత సాఫీగా సాగలేదు. ఆయుష్ బదోని 54 పరుగులతో రాణించినా, మ్యాచ్ చివర్లో ముకుల్ చౌదరి చూపిన విశ్వరూపం హైలైట్‌గా నిలిచింది. కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 54 పరుగులు చేసిన ముకుల్, చివరి బంతికి జట్టును గెలిపించాడు.

ముఖ్యంగా డెత్ ఓవర్లలో (16-20 ఓవర్ల మధ్య) అతను ఏకంగా 52 పరుగులు రాబట్టాడు. ఐపీఎల్ చరిత్రలో లక్ష్య ఛేదనలో డెత్ ఓవర్లలో 50కి పైగా పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా ముకుల్ చరిత్రకెక్కాడు. గతంలో 2013లో కీరన్ పొలార్డ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 57 పరుగులు చేసి ఈ రికార్డును నెలకొల్పాడు. సరిగ్గా 13 ఏళ్ల తర్వాత ముకుల్ మళ్లీ ఆ ఘనతను పునరావృతం చేశాడు.

సునీల్ నరైన్ అరుదైన ఘనత..

ఈ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్ సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 13 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో భారత గడ్డపై 200 టీ20 వికెట్లు పడగొట్టిన తొలి విదేశీ బౌలర్‌గా నరైన్ అరుదైన రికార్డు సృష్టించాడు. రికార్డులు నమోదైనప్పటికీ, ముకుల్ చౌదరి సునామీ ముందు కోల్‌కతా బౌలింగ్ విభాగానికి ఓటమి తప్పలేదు. లక్నో జట్టు ఈ విజయంతో ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story