Head Coach Salary: స్టార్ ఆటగాళ్లకు ధీటుగా హెడ్ కోచ్‌ల పారితోషికాలు.. టాప్‌లో ఎవరున్నారో తెలుసా?
IPL 2026 head coach salaries revealed. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో స్టార్ ఆటగాళ్లకే కాదు హెడ్ కోచ్‌లకు కూడా భారీ స్థాయిలో పారితోషికాలు అందుతున్నాయి.
Head Coach Salary
Head Coach Salary: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో స్టార్ ఆటగాళ్లకే కాదు హెడ్ కోచ్‌లకు కూడా భారీ స్థాయిలో పారితోషికాలు అందుతున్నాయి. ప్రపంచ స్థాయి అనుభవం ఉన్న మాజీ క్రికెటర్లు ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కోచ్‌లుగా వ్యవహరిస్తూ.. కోట్ల రూపాయలు అందుకుంటున్నారు. ఐపీఎల్ 2026లో హెడ్ కోచ్‌ల జీతాల వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ లెక్కల ప్రకారం.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర అత్యధికంగా రూ.5 కోట్లు అందుకుంటున్నారు.
న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చాలా ఏళ్లుగా సీఎస్‌కేకు హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి సీఎస్‌కేకు ఎన్నో టైటిళ్లు అందించాడు. ఐపీఎల్ ఆరంభంలో సీఎస్‌కేకు ఆడిన ఫ్లెమింగ్.. ఆపై హెడ్ కోచ్‌గా మారాడు. ధోనీ, ఫ్లెమింగ్ కాంబో సూపర్ హిట్ అయింది. చెన్నై ప్రాంచైజీకి అతడు నమ్మకమైన వ్యక్తిగా మారాడు. మరోవైపు శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నాడు. సంగక్కర నేతృత్వంలో ఇటీవల ఆర్ఆర్ అద్భుత విజయాలు అందుకుంటోంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో అత్యధిక జీతం అందుకుంటున్న కోచ్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్ధనే (ముంబై ఇండియన్స్) రూ.4 కోట్ల చొప్పున సాలరీ అందుకుంటున్నారు. రికీ పాంటింగ్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య పారితోషికం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పాంటింగ్ ప్రస్తుతం తన వ్యూహాలతో పంజాబ్ కింగ్స్ జట్టును బలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) రూ.3.5 కోట్లు అందుతున్నట్లు సమాచారం. ఇక భారత మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ (కేకేఆర్), ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ డేనియల్ వెటోరి (సన్‌రైజర్స్ హైదరాబాద్), గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాలకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల మధ్య జీతం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ జాబితాలో అత్యల్ప పారితోషికం అందుకుంటున్న కోచ్‌గా హేమాంగ్ బదానీ (ఢిల్లీ క్యాపిటల్స్) నిలిచాడు. అతడికి సుమారు రూ.1.5 కోట్లు అందుతున్నట్లు సమాచారం. అయితే ఐపీఎల్‌లో కోచ్‌ల బాధ్యతలు కేవలం జట్టును నడిపించడం మాత్రమే కాదు. ఆటగాళ్ల మానసిక స్థితి, వ్యూహాలు, మ్యాచ్ పరిస్థితులకు తగ్గ ప్లానింగ్, యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడం వంటి కీలక బాధ్యతలు కూడా ఉంటాయి. అందుకే ఫ్రాంచైజీలు ప్రపంచ స్థాయి కోచ్‌లకు భారీ మొత్తాలు చెల్లించడానికి వెనుకాడడం లేదు.




