IPL 2026 : గుజరాత్ టైటాన్స్ టీమ్ బస్సుకు ఘోర ప్రమాదం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ గిల్, సహచరులు
IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత గుజరాత్ టైటాన్స్ టీమ్ బస్సులో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుభ్‌మన్ గిల్ సహా ఆటగాళ్లంతా సురక్షితంగా బయటపడ్డారు.
Gujarat Titans
IPL 2026 : ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ (GT) జట్టుకు ఒక ఊహించని భయంకరమైన అనుభవం ఎదురైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన టైటిల్ ఫైట్‌లో ఓడిపోయిన బాధలో హోటల్‌కు తిరిగి వెళ్తుండగా.. గుజరాత్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న లగ్జరీ బస్సులో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లక్కీగా బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడం గమనించిన డ్రైవర్, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో పెద్ద ముప్పు తప్పింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సహా జట్టులోని ఆటగాళ్లంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ సిబ్బందితో కలిసి బస్సు హోటల్ వైపు బయలుదేరింది. మార్గమధ్యంలో బస్సు లోపల అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేయడంతో.. కెప్టెన్ గిల్, మిగతా ప్లేయర్స్ అందరూ వేగంగా కిందకు దూకేశారు. బస్సు పూర్తిగా తగలబడుతున్న సమయంలో ఆటగాళ్లు దాదాపు గంటకు పైగా రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వచ్చింది.
గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆ ఆదివారం రాత్రి ఒక పీడకలలా మారిపోయింది. మొదట మైదానంలో ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయి ఐపీఎల్ 2026 ట్రోఫీని చేజార్చుకున్నారు. ఆ ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోకముందే ఈ ఘోర అగ్నిప్రమాదం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మ్యాచ్ ఆడి అలసిపోయిన ఆటగాళ్లకు ఈ ప్రమాదం శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఎంతో భయాన్ని, ఒత్తిడిని కలిగించింది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ ప్రత్యామ్నాయ వాహనాన్ని ఏర్పాటు చేయడంతో ప్లేయర్స్ సురక్షితంగా హోటల్‌కు చేరుకున్నారు.
షెడ్యూల్ వల్ల వరుస మ్యాచ్‌లు ఆడి తీవ్రంగా అలసిపోవడం వల్లే ఫైనల్లో గుజరాత్ ఓడిపోయిందా? అనే ప్రశ్నకు ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సూటిగా సమాధానమిచ్చారు. "వరుస మ్యాచ్‌ల వల్ల మేము అలసిపోయామని చెప్పి ఆర్సీబీ సాధించిన అద్భుత విజయాన్ని నేను తక్కువ చేయలేను. మా జట్టు ఇలాంటి కుంటిసాకులు చెప్పదు. ఈ పిచ్‌పై 155 పరుగుల స్కోరు చాలా తక్కువైనప్పటికీ, మా బౌలర్లు మ్యాచ్‌ను కాపాడటానికి గట్టిగా పోరాడారు. మేము ఎక్కడ తప్పు చేశామో సమీక్షించుకుంటాం, కానీ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు మాకంటే చాలా మెరుగ్గా ఆడిందని ఒప్పుకోవాలి" అని సోలంకి స్పోర్టివ్‌గా మాట్లాడారు.




