IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మహాసంగ్రామం.. ఆర్సీబీ దూకుడా, జీటీ సమతూకమా.. టైటిల్ ఎవరిది?
IPL 2026 Final Preview: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. టైటిల్ పోరులో ఆర్సీబీ, జీటీ తలపడనున్నాయి.
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్ మహాసంగ్రామం.. ఆర్సీబీ దూకుడా, జీటీ సమతూకమా.. టైటిల్ ఎవరిది?
IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (జీటీ) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం తలపడనున్నాయి. దూకుడే ఆయుధంగా ఆర్సీబీ ముందుకు దూసుకెళ్తుండగా.. సమతూకంతో కూడిన ప్రణాళికాబద్ధమైన ఆటతో జీటీ విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ట్రోఫీ కోసం జరిగే ఈ పోరు అభిమానులకు ఆసక్తికరంగా మారింది.
ఆర్సీబీ దూకుడైన బ్యాటింగ్:
ఈ సీజన్‌లో ఆర్సీబీ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు . విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, వెంకటేశ్ అయ్యర్ వంటి ఆటగాళ్లు దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెడుతున్నారు. పిచ్ ఎలా ఉన్నా, బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో వచ్చినా.. తమ అటాకింగ్ ఆటను మాత్రం ఆర్సీబీ మార్చడం లేదు. ప్రతి మ్యాచులో ఇద్దరు బ్యాటర్లు తప్పక చెలరేగుతున్నారు. ఈ సీజన్‌లో 200కు పైగా స్కోర్లు అత్యధికసార్లు నమోదు చేసిన జట్టుగా కూడా బెంగళూరు నిలిచింది. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వం కూడా జట్టుకు అదనపు బలం అయింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌లా భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా జట్టును నడిపిస్తున్న పాటిదార్.. యువ ఆటగాళ్లు, సీనియర్ల మధ్య సమతూకాన్ని తీసుకొచ్చాడు. అతడి కెప్టెన్సీలో ఆర్సీబీ స్థిరంగా రాణిస్తోంది.
ముచ్చెమటలు పట్టిస్తున్న భువీ:
భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని ఆర్సీబీ బౌలింగ్ దళం కూడా అద్భుతంగా రాణిస్తోంది. పర్పుల్ క్యాప్ రేసులో 26 వికెట్లతో రెండో స్థానంలో ఉన్న భువీ.. పవర్ ప్లేలో వికెట్స్ పడగొడుతూ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. జోష్ హేజిల్‌వుడ్ కూడా రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో వికెట్స్ తీస్తూ.. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. రసిఖ్ సలామ్, కృనాల్ పాండ్యా కీలక వికెట్లు తీస్తూ జట్టుకు విజయాలు అందించారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ఈ బౌలర్లు విజయవంతమయ్యారు.
జీటీ బలం టాప్ ఆర్డర్:
గుజరాత్ టైటాన్స్ బలం టాప్ ఆర్డర్. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ త్రయం ఈ సీజన్‌లో జీటీ విజయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. గిల్ 722 పరుగులు, సాయి సుదర్శన్ 710 పరుగులు, బట్లర్ 507 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశారు. వేగంగా పరుగులు చేయడంకంటే వికెట్లు కాపాడుకుంటూ ఇన్నింగ్స్‌ను నిర్మించడం వీరి ప్రత్యేకత. అయితే ఈ ముగ్గురు త్వరగా అవుట్ అయితే జీటీ వెనకపడిపోతోంది. సుందర్, తేవాతియా, సందు, హోల్డర్ రాణించాల్సిన అసవరం ఉంది.
జీటీకి పటిష్ట బౌలింగ్:
బౌలింగ్‌లో జీటీకి మంచి బలం ఉంది. పర్పుల్ క్యాప్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కగిసో రబాడా 28 వికెట్లతో చెలరేగుతున్నాడు. మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, జేసన్ హోల్డర్‌లతో కూడిన బౌలింగ్ దళం ఆర్సీబీ దూకుడును అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంది. ముఖ్యంగా అహ్మదాబాద్ పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తే.. రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే మహ్మద్ సిరాజ్ ఫిట్‌నెస్ కొంత ఆందోళన కలిగిస్తోంది. క్వాలిఫయర్-2లో భుజం నొప్పితో ఇబ్బంది పడ్డ సిరాజ్.. పూర్తి కోటా ఓవర్లు వేసినా అసౌకర్యంగా కనిపించాడు. ఫైనల్‌కు ముందు అతడి ఫిట్‌నెస్‌పై అందరి దృష్టి ఉంది.
ఫేవరెట్‌గా ఆర్సీబీ:
కాగితం మీద చూస్తే.. ఆర్సీబీ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సరసన నిలవాలని బెంగళూరు భావిస్తోంది. అయితే ఒత్తిడిని తట్టుకుని ఆడగల సామర్థ్యం గుజరాత్ టైటాన్స్‌కు ఉంది. గిల్ సేన మరోసారి అద్భుత ప్రదర్శన చేస్తే రెండో టైటిల్ ఖాయం. మొత్తానికి దూకుడైన ఆర్సీబీ, సమతూకమైన జీటీ మధ్య జరిగే ఈ ఫైనల్ క్రికెట్ అభిమానులకు అసలైన పండుగలా మారనుంది. టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలంటే ఆదివారం రాత్రి వరకు వేచి చూడాల్సిందే.




